Apr 10,2023 00:18

నాటు సారా తయారు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-మాడుగుల:గ్రామాలలో నాటు సారా ఏరులై పారుతోంది. అడ్డూ, అదుపు లేక ఎక్కడ పడితే అక్కడ నాటు విరివిగా లభిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. మండలంలోని అనేక గిరిజన గ్రామాలతో పాటు, ప్రధాన గ్రామాలలో సైతం నాటు సారా దొరుకుతుంది. భారీగా నిత్యం క్రియ విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టవలసిన ఎక్సైజ్‌ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుండగా, గతంలో ప్రైవేటు వ్యాపారాలు వేలం ద్వారా దుకాణాలను దక్కించుకొని వ్యాపారం నిర్వహించేవారు. ఆ సమయంలో గ్రామాల్లో నాటు సారా ఎక్కువగా ఉండటంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే కారణంతో ప్రైవేట్‌ వైన్‌ దుకాణాలు ఎక్సైజ్‌ అధికారులతో నిరంతరం దాడులు నిర్వహించే వారు. దీంతో చాలావరకు నాటు సారా అరికట్టబడేది ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. గతంలో రెగ్యులర్‌గా నాటుసారా కేసులు నమోదు అవుతుండేవి. ఇటీవల కాలంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. దీంతో, ఎటువంటి భయం లేకుండా నాటుసారా తయారీదారులు బహిరంగంగా సారా విక్రయిస్తున్నారు. ఈ కారణంగా మద్యం దుకాణాలకు పూర్తిగా ఆదాయం గండి పడుతుంది.
ఎక్సైజ్‌ శాఖ నాటు సారాను నిరోధించడంతో పాటు ఇటీవల కాలంలో పెరిగిన గంజాయి రవాణా పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంది. కొద్ది కాలం కిందట ఎక్సైజ్‌ శాఖలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ సమస్య ఉన్నప్పటికీ అసలు దాడులే పూర్తిగా జరగడం లేదని పలు విమర్శలు వినబడుతున్నాయి. దీంతో, గ్రామాలలో నాటు సారా విచ్చలవిడిగా పెరిగి పోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీ గండి పడుతుంది. మరోపక్క గంజాయి కేసులు కూడా ఇటీవల కాలంలో బాగా తగ్గాయి.ఓ రకంగా చెప్పాలంటే ఎక్సైజ్‌ శాఖ కంటే సాధారణ పోలీస్‌ శాఖలోనే ఎక్కువగా గంజాయి కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఎక్సైజ్‌ శాఖ పట్ల అనేక విమర్శలు వినబడుతున్నాయి