Apr 27,2023 23:47

మనసున మనసై నాటికలో ఓ సన్నివేశం

ప్రజాశక్తి-తెనాలి : పట్టణానికి చెందిన వైఎస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రెండోరోజుకు చేరాయి. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్య చిల్డ్రన్స్‌ ఆర్ట్స్‌ థియేటర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. నటీనటుల ఆహార్యం, అభినయం ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. రెండోరోజు తొలి ప్రదర్శనగా ఏలూరుకు చెందిన హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ వారి 'మనసున మనసై' నాటికను ప్రదర్శించారు. చింతల మల్లేశ్వరరావు, పి.కృష్ణహితేష్‌ రచనలో మహ్మద్‌ ఖాజావలి దర్శకత్వం వహించారు. బాల్యంలో పిల్లులు పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చేంతవరకూ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఎదురు చూస్తారు. కళాశాల చదువుల దశలో పిల్లలు ఎలా ఇల్లు చేరతారోనని బిక్కుబిక్కుంటూ ఎదురుచూస్తారు. ఉద్యోగాలు చేసే దశలో దూరంగా నివసించే సమంయలో కనీసం ఈదఫా పండుగకైనా వస్తారో రారో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కనీసం తలకొరివి పెట్టేందుకైనా వస్తారా అని దీనంగా ఎదురు చూసే తల్లిదండ్రులులు లేకపోలేదు. అలాంటి తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలు, మనుమ సంతానంతో ఆడుకోవాలన్న ఆకాంక్షలను చిద్రం చేయవద్దనే సందేశంతో నాటిక ఇతివృత్తం సాగింది.
రెండో ప్రదర్శనగా సాగిన అమరావతి ఆర్ట్ప్‌, గుంటూరు వారు 'ఐదుపదులు' నాటికను ప్రదర్శించారు. కావూరి సత్యనారాయణ రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన నాటికలో 50 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన వృద్ధ జంట వారి అనుభవాను, వివాహ బంధం పవిత్రతను ప్రతినిత్యం పిల్లలకు గుర్తు చేస్తుంటారు. ఈ తరుణంలో కొడుకు, కోడలు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారన్న విషయాన్ని ఆ వృద్ధ జంట జీర్ణించుకోలేకపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే విడాకులివ్వొద్దంటూ కోడలికి హితబోధ చేస్తారు. అదే సందర్భంలో వృద్ధ జంట 50వ పెళ్లిరోజు వేడుకలకు సిద్ధపడతారు. తెల్లవారితే వేడుకలు జరగాల్సి ఉండగా వృద్ధుని భార్య మృతి చెందటంతో, ఆమె మృతదేహంతోనే వివాహవేడుకలు నిర్వహించటం ఇతివృత్తంగా సాగిన నాటిక ప్రేక్షకులను కంటతడిపెట్టించింది.
సాతులూరుకు చెందిన నడింపల్లి వెంకటసుబ్బరావు మెమోరియల్‌ బృందం ఎంవై శ్రీదేవి రచనలో, నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఆనంద మానందమాయే నాటికను ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను చాటిచెప్పిన నాటికలో బీరకాయ పీచు బంధుత్వాని కలిపి భార్యాభర్తల మధ్య, కుటుంబ వ్వవస్థలో చిచ్చుపెట్టే మూడో వ్యక్తికి గుణపాఠం చెప్పటమే ఇతి వృత్తంగా నాటిక సాగింది. నాటికలను నిర్వాహక సంస్థల ప్రతినిధులు ఎం.సత్యనారాయణశెట్టి, ఆరాధ్యుల కన్నా, డాక్టర్‌ అయినాల మల్లేశ్వరరావు పర్యవేక్షించారు.