Dec 05,2020 08:01

డయాబెటిస్‌ నివారణకు ఫ్రెడరిక్‌ బాంటింగ్‌ 'ఇన్సులిన్‌' కనుగొన్నాడు. ప్రతి షుగర్‌ పేషెంట్‌కు ఇన్సులిన్‌ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టొరంటో విశ్వవిద్యాలయాలనికి కేవలం ఒక డాలర్‌కు మాత్రమే ఇన్సులిన్‌ పేటెంట్‌ హక్కులిచ్చాడు. పెన్సిలిన్‌ని కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ కూడా పేటెంట్‌ హక్కులపై దృష్టి పెట్టలేదు. ప్రజలకు ఈ ఔషధం అందుబాటులో ఉండాలని మాత్రమే ఆయన భావించాడు. జీవ శాస్త్రంలో ఇలా అనేకమంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న ఆవిష్కరణలు, మందులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆశించారు.
          పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దాలలో 'మశూచి' మానవాళిని కబళించింది. ఈ వ్యాధి వల్ల లక్షలాది మంది ప్రజలు మరణించారు. ఎడ్వర్డ్‌ జెన్నర్‌ కనిపెట్టిన మశూచి వ్యాక్సిన్‌ మానవాళి మనుగడకు ఆధారం అయింది. గ్రామీణ ప్రాంతాలలోనే తన వైద్య వృత్తిని చేయాలని జెన్నర్‌ తీసుకొన్న నిర్ణయం...తద్వారా ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్‌...అనేక వ్యాధుల నుండి మానవ జాతి అంతరించి పోకుండా రక్షించేందుకు ఎంతో సహాయ పడింది. వైద్యం కోసం ఆయన దగ్గరకు మశూచి సోకిన వారితో పాటు...కౌ పాక్స్‌ సోకిన రైతులు కూడా వచ్చేశారు. ఎవరికైతే కౌ పాక్స్‌ సోకిందో వారికి మశూచి సోకక పోవడాన్ని ఆయన గమనించారు. అంటే కౌ పాక్స్‌ సోకిన వారిలో వ్యాధి నిరోధిక శక్తి అభివృద్ధి చెంది అది వారిలో మశూచి వ్యాధి రాకుండా కాపాడుతోందని గుర్తించాడు. 1796లో జెన్నర్‌ చేసిన పరిశోధన ఫలితంగా మశూచి వ్యాక్సిన్‌ ఆవిష్కరించబడింది.
           1749 లో జన్మించిన జెన్నర్‌ ప్రపంచం లోనే తొలి వ్యాక్సిన్‌ కనుగొని 'ది ఫాదర్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ' గా పేరు పొందారు. ఎనిమిది సంవత్సరాల బాలుడిపై జెన్నర్‌ చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. జెన్నర్‌ తన కుమారుడి మీద కూడా వ్యాక్సిన్‌ ప్రయోగం చేశాడు. జెన్నర్‌ కృషి ఫలితంగా మశూచి లేని ప్రపంచం ఆవిష్కరింపబడిందని 'ప్రపంచ ఆరోగ్య సంస'్థ 1980లో ప్రకటించింది.
           డా||జోనస్‌ సాక్‌ 1952లో పోలియోకు టీకాను కనుగొన్నాడు. దాన్ని అందరికీ ఉచితంగా అందించాలనుకున్నాడు. అందుకే అతను దానిపై పేటెంట్‌ కోసం ప్రయత్నం చేయలేదు. 1914లో జన్మించిన సాక్‌ ప్రముఖ వైరాలజిస్ట్‌గా పేరు పొందాడు. 1955లో తను కనుగొన్న వ్యాక్సిన్‌ సురక్షితమైనదని సాక్‌ ప్రకటించాడు. డా|| ఆల్బర్ట్‌ సాబిన్‌ 1957లో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. 1921లో డయాబెటిస్‌ నివారణకు ఫ్రెడరిక్‌ బాంటింగ్‌ 'ఇన్సులిన్‌' కనుగొన్నాడు. ప్రతి షుగర్‌ పేషెంట్‌కు ఇన్సులిన్‌ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టొరంటో విశ్వవిద్యాలయాలనికి కేవలం ఒక డాలర్‌కు మాత్రమే ఇన్సులిన్‌ పేటెంట్‌ హక్కులిచ్చాడు. పెన్సిలిన్‌ని కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ కూడా పేటెంట్‌ హక్కులపై దృష్టి పెట్టలేదు. ప్రజలకు ఈ ఔషధం అందుబాటులో ఉండాలని మాత్రమే ఆయన భావించాడు. జీవ శాస్త్రంలో ఇలా అనేకమంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న ఆవిష్కరణలు, మందులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆశించగా...గెలీలీ గెలీలియో, గియోనార్డో బ్రూనో, కోపర్నికస్‌ తదితర ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు యూరప్‌లో ఆనాడు మత పెద్దలను ఎదిరించి విశ్వ రహస్యాలను ఛేదించారు. బ్రూనో ఏకంగా హత్యకు గురయ్యాడు. పలువురు శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్లు, యాంటిబయాటిక్‌ల వల్ల మానవాళి అనేక మహమ్మారులను సమర్ధవంతంగా ఎదుర్కొంది.
           ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. రేపో మాపో కరోనా వ్యాక్సిన్‌ రావచ్చు. ఈ వ్యాక్సిన్‌ను నాయకులు ఎన్నికల హామీగా ఉపయోగించుకోవడం చూస్తున్నాం. నేడు అనేకమంది శాస్త్రవేత్తలలో సేవా భావం ఉన్నప్పటికీ, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరుచుకోలేక పోతున్నారు. సైన్స్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించలేక పోతున్నారు. సైన్స్‌ ఉద్యమకారులే శాస్త్రీయ ఆలోచనలను ప్రజలలో పెంచడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు మతాధిపతులు సైన్స్‌ ద్వారా ఆవిష్కరింపబడిన పరికరాల సాయంతో అశాస్త్రీయ భావాలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఫలితంగా మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. సైన్స్‌ ఫలాలు సామాన్యులకు అందడం లేదు. మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందంటే మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కృషితో పాటు మరో సుప్రసిద్ధ శాస్త్రవేత్త పి.సి.మహల్‌నోబిస్‌ కృషి ఎంతో వుంది. ఈనాటి శాస్త్రవేత్తలలో ప్రజలతో ప్రత్యక్షంగా, మీడియాతో స్వేచ్ఛగా శాస్త్ర విషయాలు మాట్లాడే వారు తక్కువయ్యారు. పరిశోధనలకు ప్రజా ప్రయోజనాలకు ఎంతో దగ్గర సంబంధం వుంటుంది. జయంత్‌ నార్లీకర్‌, పి.యం.భార్గవ వంటి శాస్త్రవేత్తలు ప్రభుత్వ విధానాలలో తలెత్తిన అశాస్త్రీయ ధోరణులను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ...ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పేవారు.
           శాస్త్రవేత్తలు, విద్యా వంతులు జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్‌ ప్రచార సంస్థలతో జత కట్టాల్సిన తరుణమిది. అప్పుడే ప్రజా సైన్స్‌ ఉద్యమాలు మరింత బలోపేతం అవుతాయి. మన దేశంలో జరిగే సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు కూడా శాస్త్రీయ కోణంలో జరగడం లేదనే విమర్శలు వున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా సైన్స్‌ పరిశోధనలు జరగాలి. అందుకే నాటి శాస్త్రవేత్తలు ప్రదర్శించిన సాహసం, చూపించిన త్యాగం నేటి పరిశోధనలకు స్ఫూర్తి కావాలి.


(వ్యాసకర్త సెల్‌ నెం.94927 12836 )

యం. రాంప్రదీప్‌