Sep 17,2021 06:32

  • నేడు పెరియార్‌ జయంతి

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్‌ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరానివారు నడవగూడదని, ఆ చుట్టుపక్కల కనిపించకూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడ సామాజిక కార్యకర్తలు కొందరు సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వం వారినందరినీ జైల్లో పెట్టింది. మరికొంతమంది కార్యకర్తలు పెరియార్‌ దగ్గరికి వెళ్ళి విషయం వివరించారు. కేరళకు వచ్చి, తమ సత్యాగ్రహాన్ని కొనసాగించమని అభ్యర్థించారు. విషయం గ్రహించిన పెరియార్‌ అక్కడికి వెళ్ళి సత్యాగ్రహం కొనసాగించారు. అప్పుడు ఆయన సత్యాగ్రహానికి దేశవ్యాప్తంగా గుర్తింపూ, పెద్దఎత్తున మద్దతూ లభించాయి. పైగా విరాళాలు కూడా వచ్చాయి. పెరియార్‌ సత్యాగ్రహానికి వస్తున్న స్పందన చూసి, అక్కడి పాలకులు తట్టుకోలేక పోయారు. వారు వెళ్ళి గాంధీజీకి అభ్యర్థించారు. ఎలాగైనా ఆ సత్యాగ్రహాన్ని ఆపించమని కోరారు. వారి కోరిక మేరకు గాంధీజీ 1925 మార్చి 9న వైక్కోమ్‌ చేరుకుని, పెరియార్‌ని కలిశారు. సత్యాగ్రహం విడిచి వెళ్ళాలని కోరారు. పెరియార్‌ అప్పుడు గాంధీజీని ఈ విధంగా ప్రశ్నించారు. ''గాంధీ గారూ! సత్యాగ్రహం వదిలి వెళ్ళమంటున్నారు సరే-నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ వైక్కోమ్‌ వీధుల్లో కుక్కలు వెళుతున్నాయి. పందులు, పశువులూ వెళుతున్నాయి. గాడిదలూ వెళుతున్నాయి. ఇవేవీ సత్యాగ్రహం చేసి వాటి హక్కుల్ని పరిరక్షించుకోలేదే? కానీ, మన సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేయాలా? పైగా సత్యాగ్రహం వదిలేసి వెళ్ళమని మీలాంటి వారు చెప్పాలా? ఇదేమైనా బావుందా? కొంచెం ఆలోచించండి!''. జవాబు చెప్పలేని గాంధీజీ కొంతసేపు మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ అన్నారు. ''ఇవాళ వీధుల్లో తిరగనిస్తే, రేపు గుళ్ళోకీ వస్తామంటారేమో -అప్పుడెలా?'' అని! మహాత్ముడిగా పిలవబడుతున్న గాంధీజీ ఖచ్చితంగా దళిత వ్యతిరేకి అనే విషయం పెరియార్‌కి స్పష్టమైంది. అదే విషయం బహిరంగంగా కూడా ప్రకటించారు. చివరికి ఎలాగైతేనేం? వైక్కోమ్‌ వీధుల్లో శూద్రులు, దళితులు స్వేచ్ఛగా తిరిగే హక్కును పెరియార్‌ సాధించి పెట్టారు. అది దక్షిణ భారతదేశంలో, తొలి మానవ హక్కుల విజయంగా చరిత్ర పుటలకెక్కింది.
పెరియార్‌ ''ద్రవిడార్‌ కజగం' స్థాపించి ద్రవిడ ఉద్యమానికి బీజం వేశారు. అది స్వాభిమాన ఉద్యమమని ప్రకటించారు. అందువల్ల ఆయనకు ద్రవిడ ఉద్యమ పితామహుడిగా గుర్తింపు లభించింది. స్వాభిమాన్‌ ఉద్యమంలో భాగంగా కొన్ని వేల కుల వ్యతిరేక వివాహాలు జరిపించారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మహిళల తోడ్పాటు చాలా అవసరమని పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానమైన స్థాయిలో అవకాశాలుండాలన్నారు. స్త్రీలు స్వేచ్ఛ కోల్పోవడం, అణిచివేతకు గురికావడం వంటి వాటికి ముఖ్య కారణం మత విశ్వాసాలు, దైవభక్తి అనీ-వాటిని వారు వదులుకుంటే భర్తలు దైవ స్వరూపులుగా కాక, తోటి మనుషులుగా కనపడతారనీ అన్నారు. బానిస మనస్తత్వం వదిలినప్పుడే పురుషాహంకారాన్ని ఎదుర్కొనగలరని పెరియార్‌ కుటుంబ సభ్యులతో ఆచరణాత్మకంగా ఉద్యమం సాగించారు. బ్రాహ్మణులను దైవాంశ సంభూతులుగా భావించకుండా, మామూలు మనుషులుగా భావిస్తే మనుషులంతా ఒక్కటే అనే భావనకు బలం చేకూరుతుంది. అటు బ్రాహ్మణేతరులు, ఇటు స్త్రీలు తమ తమ బానిస మనస్తత్వం విడనాడినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలమని తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ఉద్భోదించారు. ఇరోడ్‌ వెంకటప్ప రామసామి నాయకర్‌ గా పుట్టి పెరిగిన వ్యక్తి - కుల నిర్మూలనలో భాగంగా 'నాయకర్‌' అనే కుల సూచికను వదిలేశాడు. మిగిలిన ఇ.వి.రామసామిని ప్రజలు పెరియార్‌గా గుర్తుంచుకున్నారు.
     'వైజ్ఞానిక అవగాహన తప్పనిసరి' అని ఉద్భోదించిన పెరియార్‌...యూరోప్‌, రష్యా, మలేషియా దేశాలు పర్యటించి తన భావజాలాన్ని ప్రచారం చేశారు. దోపిడీ వర్గ నిర్మూలన జరగాలి. అది జరగాలంటే కుల నిర్మూలన జరగాలి. సాంస్కృతిక విప్లవం విజయవంతమైతే కుల నిర్మూలనా సాధ్యమౌతుంది. అందుకోసం సామాజిక ఉద్యమకారులు పెరియార్‌ని ఆదర్శంగా తీసుకుని, నాస్తికత్వాన్ని ఆయుధంగా వాడుకుంటూ వైజ్ఞానిక అవగాహనతో ఉద్యమాలు చేయాల్సి వుంది. మొదటిసారి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లు కొనసాగే విధంగా పెరియార్‌ చేసిన కృషి ఈ దేశంలోని బహుజనులకు స్ఫూర్తిదాయకం. నవంబర్‌ 26న ''కుల నిర్మూలన దినం''గా ప్రకటించి బ్రాహ్మణ హోటళ్ళ బోర్డులపై నుండి 'బ్రాహ్మణ' అనే పేరును తొలగించే ఉద్యమం చేసి సమానత్వ భావనను తీసుకొచ్చారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రభోదిస్తున్న రామాయణం, మనుస్మృతి ప్రతులను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల చేత రాముని చిత్ర పటాలను దగ్ధం చేయించారు. రాముడు, సీత, లక్ష్మణుల దిష్టి బొమ్మల్ని తగులబెట్టించారు. వినాయక విగ్రహాలు పగులగొట్టించారు. వినాయక విగ్రహాల విషయమై ఒకరు కోర్టుకెక్కారు. న్యాయమూర్తి ముందు పెరియార్‌ ధైర్యంగా తన అభిప్రాయం వెల్లడించారు. నిమజ్ఞనం పేర వినాయకుడి విగ్రహాల్ని మంచినీటి సరస్సుల్లో వేసి జనం కాలుష్యం పెంచుతున్నారనీ, అందుకు విరుద్ధంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా తాను విగ్రహాల్ని పగులగొట్టిస్తున్నానని నీటిలో వేసినా, పగులగొట్టినా ఫలితం ఒకటేనని చెప్పారు. సంతృప్తి చెందిన న్యాయమూర్తి కేసు కొట్టేశారు. ప్రజలు తాకితేనే విగ్రహాలు మైలపడితే అలాంటి దేవుళ్ళు మనకెందుకూ; అని ప్రశ్నించిన పెరియార్‌, అలాంటి విగ్రహాల్ని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలి. లేదా చెరువు గట్టున పడేస్తే, అవి బట్టలు ఉతుక్కోవడానికైనా పనికొస్తాయనే సూచన చేశారు.
      పెరియార్‌ ఉద్యమ కృషి ఫలితంగా 1967లో తమిళనాడులో బహుజనుల రాజ్యం ఏర్పడింది. 'దేవుడు లేడు-లేనే లేడు' అనే నినాదాలు సభల్లో తమిళనాడు అంతటా విరివిగా వినిపించేవి. ఆ విషయం మీద ధైర్యంగా మాట్లాడగలిగేవారు. అంటే పెరియార్‌ బోధనల ప్రభావం ఎంత బలంగా పడిందో అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చిన వారు పెరియార్‌ విధానాలను కొనసాగించకపోవడం వల్ల మళ్ళీ అక్కడ మనువాదులు బలపడ్డారు. పెరియార్‌ కాలంలోనే స్వాభిమాన్‌ పెళ్ళి చట్టం అమలయ్యింది. నాస్తిక, హేతువాద, వైజ్ఞానిక ఉద్యమాల స్ఫూర్తితో...పెరియార్‌, ఫూలే, అంబేద్కర్‌ బోధనల ప్రభావంతో...జీవిస్తున్న నేటి తరం ఇప్పటికీ న్యాయం కోసం తల్లడిల్లిపోతోంది. అయితే నిరాశపడకుండా మరో ముందడుగు వేసి తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా మనువాద వారసులు పాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని, వ్యవస్థల్ని, మానవీయ విలువల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెరియార్‌ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, సమ సమాజ స్థాపన కోసం ఉద్యమిస్తూనే ఉండాలి. సంఘరక్షణ ఆగిపోగూడదు. యుద్ధం ఆగిపోగూడదు. మనువాద అనాలోచిత, అహంకారపూరిత అసమర్థ ప్రభుత్వాల నుండి ప్రజలు తమని తామే రక్షించుకుంటూ ఉండాలి. మానవీయ విలువల్ని పరిరక్షించే, వైజ్ఞానిక దృక్పథం గల ప్రభుత్వాల కోసం ప్రజలు కృషి చేస్తూనే ఉండాలి !
 

/ వ్యాసకర్త- సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌ /

డా|| దేవరాజు మహారాజు