Sep 20,2023 23:49

ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని మైలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు బుధవారం జూమ్ ద్వారా ప్రముఖ నాసా ఖగోళ శాస్త్రవేత్త హేన్రి ట్రూఫ్ తో ముచ్చటించారు. బాహ్య సౌర వ్యవస్థలో రింగులు, దుమ్ము, ధూళి, గతి శాస్త్రంలో ఆయన నైపుణ్యం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయనతో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు పచ్చారు హరికృష్ణ ముందుగా అనుమతి పొందిన ప్రకారం పాఠశాల విద్యార్థులతో మాట్లాడించారు. విద్యార్థులు అనేక ప్రశ్నలు, అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. వీటిలో అంతరిక్షం ఎందుకు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది? సౌర కుటుంబ అవతల జీవం ఉంటుందా? రాత్రిపూట అన్ని నక్షత్రాలను ఎందుకు చూడలేకపోతున్నాం? సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించుటకు నాసా చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి అనే ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మాచర్ల మోహనరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.