Jul 25,2023 23:43

పంట పొలాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల పరిధిలో నారు మడులను అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్తలు ఎం.విశాలాక్షి, ఎ.శిరీష, విశాఖపట్నం జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్‌.సుబ్రమణ్యం, భీమిలి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, మండల వ్యవసాయాధికారి సిహెచ్‌.సంధ్య రత్నప్రభ మంగళవారం పరిశీలించారు. ఆనందపురం మండలం బోని గ్రామంలో పొలంబడి వరి నారుమడులను పరిశీలించి, ఆకు ఎండు తెగులును గుర్తించారు. నివారణకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో, స్త్రెప్టోసైక్లిన్‌ ఒక గ్రాము పది లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. పద్మనాభం మండలం పాండ్రంగిలో మిషన్‌తో వేసిన వరి నారు మడులను సందర్శించారు, ప్రధాన పొలంలో ఏకారానికి డిఎపి ఒక బస్తా లేదా సూపర్‌ రెండు బస్తాలు, యూరియా అర బస్తా, పొటాష్‌ అర బస్తా దమ్ములో వేయాలని సూచించారు. జింక్‌ లోపాన్ని సవరించడం కోసం ఎకరానికి 20 కేజీలు జింక్‌ సల్ఫేట్‌ను మిగిలిన ఎరువులతో కాకుండా రెండు రోజులు ముందుగా వేసుకోవాలని తెలిపారు. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో వేరుశనగ పొలాలను సందర్శించి అధిక దిగుబడుల కోసం రైతులకు పలు సూచనలు చేశారు. పూత దశలో జిప్సం వాడాలని తెలిపారు. ఇమాజిత్‌పైర్‌ ఏకరానికి 300 ఎంఎల్‌ పిచికారి చేయడం ద్వారా వేరుశనగ పంటలో కలుపు నివారించవచ్చని చెప్పారు.