Jul 26,2022 23:42

నారు మడులను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

ప్రజాశక్తి-పద్మనాభం : వరి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి రైతులకు సూచించారు. మండలంలోని బి తాళ్లవలస, కోరాడ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులు వేసిన వరి నారు మడులను కూడా పరిశీలించారు. నారుమడి సస్యరక్షణపై రైతులకు వివరించారు. సుమారు 5 సెంట్లు విస్తీర్ణంలో వేసిన వరి నారు మడిలో ఒక కేజీ కార్బోప్యూరన్‌ గుళికలను వేసుకున్నట్లయితే వరి నాట్లు వేసిన 30 రోజుల వరకు పీక పురుగు, తెగుళ్ళును రాకుండా ఆరికట్ట వచ్చని తెలిపారు. నాట్లు వేసినప్పుడు రెండు మొనలు వేసుకోవాలన్నారు. నాట్లు వేసిన తరువాత కాలి బాటలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల గాలి, సూర్యరశ్మి పంటకు సంవృద్ధిగా అందుతుందన్నారు. దోమ పోటు కూడా రాదని పేర్కొన్నారు. దమ్ములో ఎకరానికి ఒక డిఎపి బస్తాను, 20 కిలోల పొటాష్‌ను వేసుకోవాలని తెలిపారు. మూడు దపాలుగా యూరియా వెయ్యాలని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన కోసం రైతులందరూ ఈ నెల 31వ తేదీ లోగా ఇకెవైసి చేసుకోవాలన్నారు. పంట నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రతి రైతూ నమోదుచేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ శాఖ ఎడిఎ విజయప్రసాద్‌, స్థానిక వ్యవసాయాధికారి ఎంవిఎస్‌.చలం, కోరాడ సర్పంచ్‌ కోరాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.