పార్వతీపురం రూరల్: పట్టణానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, లయన్ నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన ''ఆనందలోకం'' నవలకు మరో గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళ్తే... నారంశెట్టికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ''ఆనందలోకం'' నవలపై చేసిన పరిశీలనకు ఇటీవల ఎంఫిల్ పట్టా ప్రదానం చేశారు. నారంశెట్టి విలేకరులతో మాట్లాడుతూ చెన్నైకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుండి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ నేతృత్వంలో జరీనాషేక్ చేసిన పరిశీలనకు గానూ ఎంఫిల్ పట్టాను ప్రదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో నారంశెట్టి రచించిన వివిధ గ్రంథాలపై చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంఫిల్ పట్టాలు పొందగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జాగరాన శరత్‌బాబు చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు.
తపాలా శాఖలో పర్యవేక్షకునిగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్న నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహితీలోకానికి సుపరిచితులు. వీరి కలం నుంచి వెలువడిన 1500కు పైగా కథలు, గేయాలు, నవలలు, వ్యాసాలు, కవితలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురణ పొందాయి. వీరి రచనల్లో ఇప్పటికి 31 పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఆయన రాసిన ''మేలెరిగిన మనిషి'' కథా సంపుటికి హైదరాబాదుకి చెందిన బాల సాహిత్య పరిషత్ నిర్వహించిన గ్రంథాల పోటీలో ప్రథమ బహుమతి, 'వింత జలం' కథా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం, 'ఇ-తరం కుర్రాడు' నవలకు తానా నవలల పోటీలో బహుమతి వచ్చింది. రైతు సింహాసనం నవలను అప్పటి భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ప్రస్తుతం నారంశెట్టి బాల సాహిత్య పీఠం, ఉత్తరాంధ్ర రచయితల వేదికలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన బాల సాహిత్య పురస్కారానికి జ్యూరీగా కూడా వ్యవహరించారు. నారంశెట్టి ఆనందలోకం నవలపై పరిశీలనకు ఎంఫిల్ పట్టా ప్రదానం చేసినందుకు తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికష్ణ హర్షం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, సాహితీవేత్తలు నారంశెట్టిని అభినందించారు.










