Jan 22,2023 21:15

పరిపాలనాపరమైన అనుమతులు పూర్తి
సాంకేతిక అనుమతుల కోసం అధికారుల సర్వే
డిపిఆర్‌కు గ్రీన్‌సిగల్‌ లభిస్తే వేసవిలోనే పనులు ప్రారంభం
ప్రజాశక్తి - ఉంగుటూరు

ఏలూరు కాలువపై నారాయణపురం ఆర్‌అండ్‌బి వంతెనను తొలగించి కొత్త వారధి నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులిచ్చి రూ.8.50 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అధికారులు తదుపరి చర్యలు ప్రారంభించారు. చేబ్రోలు-ఉండి రాష్ట్రీయ రహదారి (ఆర్‌అండ్‌బి) నారాయణపురం వద్ద ఏలూరు కాలువపై 1936లో బ్రిటీష్‌ పాలకులు ప్రస్తుతం ఉన్న వంతెనను నిర్మించారు. కొల్లేరు ముఖద్వారంగా పేరొందిన ఈ వంతెన మీదుగా భీమవరం, గణపవరం నుంచి ఆక్వా, వరి, పలు పరిశ్రమల ఉత్పత్తుల రవాణా సాగుతోంది. అంతేకాకుండా భీమవరం నుంచి తెలంగాణా రాష్ట్రం సత్తుపల్లి వరకూ ఆర్‌టిసి బస్సు రూటు కూడా ఇదే వంతెన మీదుగా వెళ్తోంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ వంతెన శిథిలావస్థకు చేరి సుమారు పుష్కర కాలంపైనే అయ్యింది. ఈ వంతెన శ్లాబు కింద చువ్వలు తుప్పుపట్టి పెచ్చులూడటం, ఓ ఖానా కొంతవరకూ కుంగిపోవడం జరిగింది. అప్పటి నుంచి మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు సైతం వంతెన నిర్మాణానికి కృషి చేసినా కార్యరూపం దాల్చలేదు. గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు ఈ వంతెన సమస్యను తీసుకెళ్లడంతో ఓ కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు.
సైట్‌ ప్లాన్‌ సర్వే పనులు ప్రారంభం
నారాయణపురం వంతెన నుంచి సుమారు 50 మీటర్ల వరకూ ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు గురైంది. పరిపాలనాపరమైన అనుమతులు రావడంతో సాంకేతిక అనుమతుల కోసం అవసరమైన సైట్‌ సర్వే పనులను ఆర్‌అండ్‌బి ఎఇ భాస్కరరావు ప్రారంభించారు. ప్రస్తుత వంతెన ఎంత విస్తీర్ణంలో ఉంది, వంతెన నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంత కావాలి, ఎంత అందుబాటులో ఉంది, ఎంత ఆక్రమణలో ఉంది, ఆయా ఆక్రమణల్లో ఏయే కట్టడాలు ఉన్నాయి, నేల స్వభావం తదితర అంశాలపై సైట్‌ ప్లాన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని, అక్కడ నుంచి వంతెన డిజైన్‌ (డిపిఆర్‌) సిద్ధం చేస్తారని, ఆపై వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎఇ భాస్కరరావు చెప్పారు. డిపిఆర్‌ పూర్తయితే ఈ వేసవిలోనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
సామర్థ్యానికి మించి వాహనాల రాకపోకలు
వంతెన మీదుగా 40 టన్నులకు పైబడి వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. సామర్థ్యానికి మించి భారీ వాహనాల రాకపోకలతో వంతెన ఎక్కడ కూలిపోతుందో అనే భయాందోళనతో స్థానికులు ఉంటున్నారు.
వీడనున్న ఇరుకు వంతెన ఇబ్బందులు
మొదట్లో ఈ వంతెన మీదుగా రెండు భారీ వాహనాలు ఒకేసారి వెళ్లేవి. ఫత్తేపురం తదితర కొల్లేరు గ్రామాలకు తాగునీటి పథకం పైపులు ఈ వంతెన మీద నుంచే వేశారు. అప్పటి నుంచి ఇరుకు వంతెనగా మారింది. అంతేకాకుండా అక్రమణలతో రోడ్డు ఇరుకై నిత్యం ట్రాఫిక్‌ సమస్యలతో స్థానికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా కొత్త వంతెన నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్యకు మోక్షం కలగనుందని గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.