Oct 20,2023 19:00

చింతమనేని, ఎల్లో మీడియా అసత్యపు ప్రచారాలు మానుకోండి
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
   మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌, టిడిపి అనుబంధ మీడియా సంస్థలు వాలంటీర్‌ ద్వారా మోసపోయిన బాలిక విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ వైసిపి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని దెందులూరు వైసిపి అధికార ప్రతినిధి, శ్రీరామవరం సర్పంచి కామిరెడ్డి నాని బాబు తెలిపారు. శుక్రవారం దెందులూరు పరిధిలో సోషల్‌ మీడియాలో చింతమనేని ప్రభాకర్‌, టిడిపి అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలపై నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ బాలిక కుటుంబ సభ్యులను బాధ పెట్టడం ఇష్టం లేక టిడిపి వారు ఎంత అసత్య ప్రచారాలు చేసినా తాను మాట్లాడకుండా ఉన్నానని, కానీ మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ బాధిత బాలిక కుటుంబ సభ్యులతో అబద్ధాలు చెప్పించడం చాలా దారుణమని అన్నారు. టిడిపి వారు సోషల్‌ మీడియాలో తన దగ్గరికి వస్తే రూ.10 వేలు బాధిత బాలిక గర్భిణీకి ఇప్పిస్తానంటూ చెప్పానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి అసత్య ప్రచారాలు చింతమనేని మానుకోవాలని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని నాని విమర్శించారు. బాలికతో పాటు గ్రామ వాలంటీర్‌ కుటుంబ సభ్యులు వైసిపి, టిడిపిలకు చెందిన పెద్దల సమక్షంలో రాజీ చేసుకుని, వివాహం చేసుకుంటామని మాట్లాడుకున్న నేపథ్యంలో వాలంటీర్‌ పారిపోతే పోలీసులకు వైసిపికి చెందిన గ్రామ పెద్దలు మాత్రమే ఫిర్యాదు చేయడం ఏంటని ఆయన అన్నారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికైనా మీడియా వారు సైతం పోలీస్‌ స్టేషన్‌లో బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించాలని, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన పోలీసుల ఫిర్యాదులో కొన్ని టిడిపి అనుకూల పత్రికలో వచ్చిన వార్తలు చాలా అబద్ధమన్నారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన దాంట్లో ఎక్కడా కూడా నా గురించి ప్రస్తావించలేదన్నారు. దీనికి తోడు సంబంధం లేని ఇద్దరు వాలంటీర్లు పేరు కూడా ఈ బాలిక కేసులో పోలీసులు ఫిర్యాదు చేయడం చాలా బాధాకరమన్నారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాని హెచ్చరించారు.