Nov 17,2023 22:31

నాపై హత్యాయత్నానికి కుట్ర

నాపై హత్యాయత్నానికి కుట్ర
సిఐకి జనసేన కోటా వినుత ఫిర్యాదు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: 'నన్నూ, నా భర్తను అంతమొందించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు..' అని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కోటా వినుత పరోక్షంగా అధికారపార్టీ పై ఆరోపించారు. 'ఓ పథకం ప్రకారం హత్య చేయడానికి మా కారు చక్రాలకు బోల్టులు తీసేయడమే ఇందుకు ఉదాహరణ ' అని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై వినుత గురువారం అర్ధరాత్రి టూ టౌన్‌ సీఐ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. తమ కారు చక్రాలకు బోల్టులు తీసేశారని కొందరు మాకు ఫొటో తీసి వాట్సప్‌ చేయడంతో తాము మేల్కొన్నామని, లేకుంటే మార్గ మధ్యంలో ప్రమాదానికి గురయ్యేవారమని వాపోయారు. మొత్తం మీద తాము చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, తమను ధైర్యంగా ఎదుర్కోలేక ఇలా పిరికిపందల్లా హత్య చేయడానికి కుట్ర పన్ను తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము సైనికుల్లా పోరాడతామనీ, పవన్‌ కల్యాణ్‌ను సీఎంను చేసేవరకు నిద్రపోమని స్పష్టం చేశారు.