నాణ్యతతో 'జగనన్నకు చెబుదాం' అర్జీలు పరిష్కారం :కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - టి.నరసాపురం
జగనన్నకు చెబుదాం(జెకెసి) స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువచేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మండలస్థాయిలో నిర్వహిస్తుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాలులో బుధవారం నిర్వహించిన టి.నరసాపురం మండలానికి సంబంధించిన జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో నిర్వహించిన జెకెసి కార్యక్రమానికి ప్రజలనుండి మంచి స్పందన లభించిందని, 153 అర్జీలు అందాయని తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి అందిన అర్జీలను నాణ్యతతో నిర్ధేశిత కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. మండలంలో అందిన అర్జీల పరిష్కారంలో స్థానిక విఆర్‌ఒలు, పంచాయతీ సెక్రటరీలు, సర్వేయర్లు, పనిపై నిమగమై ఉండాలన్నారు. సమస్య పరిష్కారంలో ఎలాంటి ఆలస్యానికీ తావులేదన్నారు. అందిన అర్జీల పరిష్కారం క్రమపద్ధతిలో ఉండాలని పరిష్కార తీరు తెలిపే ఎండార్స్‌మెంట్‌లో స్పష్టత ఉండాలన్నారు. అక్టోబరు నెల నాటికి అర్జీల పరిష్కారంలో సంతృప్తిస్థాయి పెరిగి జిల్లాస్థాయిలో ఐదో స్థానంలోపు రావడానికి మండల అధికారులు ప్రయత్నించాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ మండలంలో పనిచేసేవారంతా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కారంపై కొద్దిపాటి శ్రద్ధ, శ్రమ పెట్టాలన్నారు. అదే విధంగా జిల్లాస్థాయి అధికారులు ప్రతిఅర్జీ వారీగా వ్యక్తిగతంగా త్వరగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. ఆయా అర్జీల పరిష్కారంలో అర్జీదారుడు అసంతృప్తి వ్యక్తం చేసిన వాటిని కేసు వారీగా పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికను సోమవారం అందజేయాలన్నారు. సర్వేకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని
టి.నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన సోలా యువశ్రీ వికలాంగురాలికి 94 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి పెన్షన్ రావడంలేదని సోలా రామలక్ష్మి ఆమె తరపున అర్జీ అందజేశారు. టి.నరసాపురానికి చెందిన పెద్దిన చంద్రశేఖర్‌రావు 22ఎలో పెట్టిన ఆ భూమిని 22ఎ నుండి విడిపించి యథావిధిగా ఉంచాలని కోరుతూ అర్జీ అందజేశారు. అదేవిధంగా చింతలపూడి-టి.నరసాపురం రోడ్డులో గుర్రాజుకుంట వద్ద చెత్త డంపింగ్ నిలిపివేయాలని సామాజిక కార్యకర్త ఎస్‌డి.నాసర్‌పాషా అర్జీ అందజేశారు. టి.నరసాపురానికి చెందిన డి.ఉమామహేశ్వరరావు 22ఎ నుంచి భూమిని తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. టి.నరసాపురానికి చెందిన అనుమోలు సుశీల సొసైటీలో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సూర్యనారాయణరెడ్డి, ఆర్‌డిఒ జాన్సీరాణి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జివివి.సత్యనారాయణ, అడిషనల్ ఎస్‌పి భాస్కర్‌రావు, ఎంపిపి దారబోయిన లక్ష్మి, గ్రామ సర్పంచి మోదుగ సునంద, తహశీల్దార్ జెవి.సుబ్బారావు, ఎంపిడిఒ మంగకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.










