
నాణ్యతకు ప్రాధాన్యత
- నియోజకవర్గానికి ఐదు రోడ్లు మంజూరు
- ప్రజాశక్తితో ఆర్ అండ్ బి ఎస్‌ఇ ఆర్.నాగరాజు
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్
రోడ్లు మరియు భవనాలు నిర్మాణంలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే విధంగా కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తానని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఇ. ఆర్ నాగరాజు అన్నారు. నియోజకవర్గానికి ఐదు హై ప్రియారిటీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రయాణం రవాణా సక్రమంగా జరగాలంటే రోడ్లు ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంటామని, ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంచిగా ఉండాలని తెలిపారు. ప్రజాశక్తితో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు...
ఉభయ జిల్లాల్లో 2022 -23 సంవత్సరానికి కొత్త పనులు ఎన్ని వచ్చాయి?
ఎస్‌ఇ : 2022- 23 సంవత్సరానికి ఉభయ జిల్లాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లు 13 భవనాల నిర్మాణానికి 30 కోట్లు మంజూరయ్యాయి. (నంద్యాలకు నాలుగు, కర్నూలుకు 9). అలాగే 50 లక్షలతో ఐదు బ్లాక్ పబ్లిక్ యూనిట్లు వచ్చాయి.
భవనాల మరమ్మత్తులకు ఏమైనా నిధులు వచ్చాయా?
ఎస్‌ఇ : కర్నూల్లో కలెక్టరేట్ భవనం మరమ్మత్తుల కోసం రూ.8 కోట్లు మంజూరు అయ్యాయి. పనులు జరుగుతున్నాయి.
హై ప్రియారిటీ రోడ్స్‌కు ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి?
ఎస్‌ఇ : హై ప్రియారిటీ రోడ్స్ నియోజకవర్గానికి ఐదు రోడ్లు చొప్పున
25 ప్యాకేజెస్‌కు దాదాపు రూ.70 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీలలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా పాణ్యంకు మూడు, కోడుమూరు రెండు, నందికొట్కూరు రెండు, మంత్రాలయం మూడు, నంద్యాల రెండు, ఎమ్మిగనూరు ఒకటి, ఆదోని మూడు, శ్రీశైలం ఒకటి, పత్తికొండ మూడు, ఆలూరు ఒకటి, ఆళ్లగడ్డ రెండు, బనగానపల్లె ఒకటి, డోన్ ఒకటి ఉన్నాయి.
కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి భవనం ఏమైనా మంజూరు అయిందా?
ఎస్‌ఇ : నంద్యాల కలెక్టరేట్ నిర్మాణం కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సంబంధించిన పది ఎకరాల స్థలం సర్వేలో ఉంది. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయితే భవన నిర్మాణం చేపడతాం.
పుష్కరాలకు సంబంధించి మిగిలి ఉన్న నిధులతో ఏమైనా రోడ్లు వేస్తున్నారా?
ఎస్‌ఇ : పుష్కరాలకు సంబంధించి న మిగిలి ఉన్న నిధులతో రేమట. ఉల్చల రోడ్లు పూర్తిగా పాడవడంతో రేమటకు రూ.రెండు కోట్లు, ఉల్చాలకు రూ.నాలుగు కోట్ల కేటాయించి పనులు ప్రారంభించాం.
కర్నూలులో వక్కెర బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. నిర్మాణానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా?
ఎస్‌ఇ : వక్కెరవాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.8 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాము. నిధులు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు చర్యలు ఏమైనా తీసుకున్నారా?
ఎస్‌ఇ : గ్రామీణ ప్రాంతాలలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్న విషయం వాస్తవమే. అయితే ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ ప్రాధాన్యతను బట్టి రోడ్లను నిధులు రాగానే వేయడం జరుగుతుంది.
చేసే పనులలో నాణ్యత లేకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్‌ఇ : చేసే పనుల్లో నాణ్యత లేకుంటే క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ విజయవాడ వారు వచ్చి రోడ్లను పరిశీలించడం జరుగుతుంది. రోడ్లలో నాణ్యత లేకుంటే రికవరీ పెడతారు. బిల్లులు ఆపేయడం జరుగుతుంది.