Aug 03,2023 22:39

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ చేతన్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనబడి, నాడు నేడు పనులలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో చేపట్టిన నాడు నేడు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ మీనాక్షి, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ రషీద్‌ ఖాన్‌, వెంకటరమణ, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, విద్యాభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని అన్నారు. నాడు నేడు పనులలో భాగంగా రక్షిత మంచినీటి కోసం నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం ల్యాబ్‌లు ఏర్పాటు, ఫర్నిచర్‌ గ్రీన్‌ బోర్డులు ఏర్పాటు, అదనపు తరగతి గదులు ప్రహరీల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. రెండవ దశలో 1081 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. జిల్లాలో వివిధ దశలలో పనులు జరుగుతున్నాయని వచ్చే వారంలోపు పనులలో పురోగతి కనిపించాలని ఆదేశించారు. జిల్లాలో 21 జూనియర్‌ కళాశాలల్లో రూ. 4 కోట్లతో జరుగుతున్న నాడు నేడు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్‌, చిదంబరం, జయచంద్ర, మురళీమోహన్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.