అనంతపురం కలెక్టరేట్ : నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని సిపిఎం 1వ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితం నగరంలోని పాత డిఇఒ కార్యాలయం వద్ద నిర్మించిన కల్వర్టు కూలిపోవడంతో విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రూ.వందల కోట్లతో బళ్లారి రోడ్డు నుంచి పంగలరోడ్డు దాకా నిర్మిస్తున్న రోడ్డు నాసిరకంగా ఉందన్నారు. ఇక కల్వర్టులు చిన్న వాహనాలు తిరిగితేనే కూలిపోతున్నాయన్నారు. ఆర్‌అండ్‌బి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పనులు నాణ్యతగా చేశారన్నారు. ఎందుకంటే కూలిన కల్వర్టును పరిశీలిస్తే చిన్న కడ్డీలు వేయడంతోపాటు కంకర, ఇసుక, సిమెంట్ సమపాళ్లలో కలిపి నిర్మించేలేదని అర్థం అయిందన్నారు. నాసిరకంగా పనులు జరుగుతున్నా నేషనల్ హైవే, మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అదేవిధంగా రెండవ రోడ్డులో గతవారం క్రితం వేసిన తారురోడ్డు కూడా నాణ్యతగా లేదన్నారు. ఆయా పనులను చేసిన కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కూలిన కల్వర్టును పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు










