ప్రజాశక్తి-చీరాల: నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రామాణాలను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు. చీరాల పురపాలక సంఘ పరిధిలో అగ్నిమాపక కేంద్రం గేటు దగ్గర రైల్వే ట్రాక్ నిమిత్తం మహిళా కళాశాల సమీపంలో నీటి, డ్రైనేజ్ అభివృద్ధి పనులు చేస్తున్నారు. వీటిని అధికారులతో కలసి గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. 1వ వార్డు లో జరుగుతున్న డ్రైనేజ్ పనులనూ పరిశీలిం చారు. తదుపరి సర్వేపల్లి మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జగనన్న గోరుముద్ద పథకం, పాఠశాలలో మౌలిక వసతులు గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. అదేవిధంగా స్థానిక సచివాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న దస్త్రాలను పరిశీలించారు. ప్రజలకు సచివాలయం ద్వారా అందే సేవలను నిబద్ధతతో అందించాలని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ ఏసయ్య, సచివాలయ ఉద్యోగులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.










