ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. శనివారం స్థానిక మున్సిపాల్టీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పట్టణంలో కొత్తవలసలో ఉన్న ఏడో వార్డు నందమూరి కాలనీ మొదటివీధిలో సిసి రోడ్డు, కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గడపగడపకు నిధుల నుంచి రోడ్డు, కాలువ నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం 8వ వార్డు పెద్దవీధిలో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రోడ్డు నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తిచేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టరుకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, వార్డు కౌన్సిలర్లు బొత్స ఆనంద్, పి.జయంతి, జి.గాయత్రి, ఎస్.లావణ్య, వి.నేతాజీ, ఎన్.సుధీర్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు మేరువ వెంకట్రావు, ఎన్ సదానందం, వైసీపీ నాయకులు, , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










