Nov 02,2023 20:39

కాలువ పనులను పరిశీలిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయచంద్ర

ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్‌ :  చెరువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత సరోవర్‌ పథకంలో భాగంగా పట్టణంని కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో నాణ్యతలోపం కన్పిస్తుందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఆరోపించారు. గురువారం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆయనతో పాటు టిడిపి నాయకులు, కౌన్సిల్‌ సభ్యులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ కోనేరు గట్టుపై నిర్మాణం చేపడుతున్న రోడ్డు కేవలం బూడిదతో కూడిన నాసిరకమైన గ్రావెల్‌ మాత్రమేనని, సైడు వేసిన సిమెంట్‌ దిమ్మలు కూడా నాణ్యతలోపమేనని, నాణ్యమైన మెటీరియల్‌ కాదని అన్నారు. ఈ కోనేరు అభివృద్ధికి రూ.94లక్షల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులను దుర్వినియోగం చేయడానికి మాత్రం తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై తక్షణమే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరుతామన్నారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ను కూడా సంప్రదిస్తామన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఎటువంటి నాణ్యతాలోపం జరగలేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్కడా నాణ్యతతో కూడిన పనులు జరగడంలేదని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే చూస్తుంది తప్ప అభివృద్ధి చేయడానికి కాదన్నారు. ఈ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంపై తాము ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఆయనతో పాటు ఐటిడిపి కో ఆర్డినేటర్‌ బార్నాల సీతారాం, ఐటిడిపి అరకు పార్లమెంటు అధ్యక్షులు కోరాడ నారాయణరావు, టిడిపి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, పోలా నత్యనారాయణ (పిఎన్‌ఎన్‌), జి.భానుప్రసాద్‌, కోలా మధునూదనరావు, బలగ మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.