
ప్రజాశక్తి-రేపల్లె: కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో విద్యుత్తు లైన్లను ఆధునీకరణ పనులు చేపట్టినట్లు జిల్లా విద్యుత్ శాఖాధికారి (ఎస్‌ఈ) మురళీకృష్ణ తెలిపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీ వ్యాంపుడు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డిఎఫ్‌ఎఫ్) పథకం ద్వారా 33 కెవి లైన్లు రెండు, 11 కెవి లైన్లు రెండు వేస్తున్నట్లు తెలిపారు. పాత విద్యుత్ లైన్లకు అనుసంధానంగా ఈ లైన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ఇసుకపల్లి 130 కెవి సబ్ స్టేషన్ నుంచి పేటేరు సబ్ స్టేషన్‌కు ఒక లైను, మండలంలోని పోటుమేరక సబ్‌స్టేషన్ వరకు మరొక విద్యుత్ లైన్ మంజూరు అయినట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పాత లైన్లు ఉంటే వాటిని మార్చుతున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కండక్టర్లు మార్చటం, స్టార్ రేటింగ్ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఆధునీకరణ చేయటం ద్వారా నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు విద్యుత్ శాఖ ఏడిఏ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.