ప్రజాశక్తి - చిలమత్తూరు: అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలని వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీ రైతులు దేమకేతేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా వారు మాట్లాడతూ వ్యవసాయరంగానికి నాణ్యమైన విద్యుత్ అందించకపోవడంతో బోర్లు క్రింద సాగుచేసిన తమ పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. మూడు నెలలుగా తాము ఇబ్బంది పడుతున్నామని అనేక సార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వారం రోజుల క్రితం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో దేమకేతేపల్లి సర్పంచి ఈడిగ తిరుమలేష్ ఈ సమస్యను లేవనెత్తారని గుర్తు చేశారు. రైతుల ఆందోళనకు స్థానిక వైసిపి నాయకులతో పాటు వైసిపి సర్పంచి ఈడిగ తిరుమలేష్ మద్దతు తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆందోళన వద్దకు చేరుకున్న చిలమత్తూరు ఇన్‌ఛార్జి ఎఇ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెయిన్ ఫీడర్‌లో సమస్య, అధికలోడు కారణంగా ఈ సమస్య ఏర్పడిందని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.










