ముద్దనూరు : విద్యుత్ అంతరాయాన్ని తగ్గించి ప్రజలకు, రైతులకు నిరంతరమూ నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రమణ సిబ్బందికి సూచించారు. మండలంలోని ఉప్పలూరు విద్యుత్ ఉప కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం విద్యుత్ వినియోగదారులతో సమావేశం నిర్వహించి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పలూరు ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కరించి నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని గ్రామస్తులు, రైతులు కోరారు. విద్యుత్ అంతరాయానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ పంట పొలాల రక్షణ కోసం విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత అంతరాయం ఏర్పడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. పొలాలకు విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై, కంచె అరికట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించడం, ఒరిగిన స్తంభాలు, లూజుగా ఉన్న లైన్లు యుద్ధ ప్రాతిపదికన సరి చేయాలని చెప్పారు. ప్రజలకు విద్యుత్ సమస్య ఏర్పడితే పరిష్కారం అయ్యేంతవరకు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించి, పనిచేయని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలపై తీసుకోవాల్సిన భద్రతపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలు నియంత్రించి ప్రజలకు అవసరమైన పద్రేశంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పగటి వేళ వీధిలైట్లు వెలగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసులరెడ్డి, డిఇలు సుబ్రహ్మణ్యం, శేషగిరి బాబు,ఎఇ శ్రీనివాసరాజ వర్మ సిబ్బంది పాల్గొన్నారు.










