ప్రజాశక్తి - గరుగుబిల్లి : నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించేందుకు సమాన దృష్టితో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజిమాల దేవి, ఇండేల లక్ష్మీ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మండలంలో శుక్రవారం పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, చౌక ధరల డిపోలను తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల నిల్వలను రిజిష్టర్లలో నమోదును సరిచూశారు, జగనన్న గోరు ముద్ద పథకం మెనూను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యాంశాల పరిజ్ఞానాన్ని, ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరీక్షించారు. జగనన్న గోరుముద్ద పథకంలో వండిన వంటకాలు మెనూ ప్రకారం సక్రమంగా అందిస్తున్నదీ లేనిదీ ఆహార పదార్థాలను రుచి చూసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపం తలెత్తకుండా ఉండేలా బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు ఉదాసీనత చూపకుండా పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న మెనూను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. డా, బి.అర్.అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థినులు వెంటనే సరైన సమాధానాలు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన
గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆహార కమిషన్ సభ్యులు పరిశీలించారు. పిహెచ్‌సిలో అందుబాటులో ఉన్న రక్త పరీక్షను ప్రశ్నించగా 39 రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, రక్తహీనత కలిగిన కేసులు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలపై ఆరా తీశారు. ప్రసవాల అనంతరం ప్రధాన మంత్రి వయా వందన యోజన పథకం అందజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఇఒ ఎన్.ప్రేమ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.శివప్రసాద్, ఐసిడిఎస్ పీడీ కె.విజయగౌరి, మధ్యాహ్న భోజన పథకం ఎడి పి.దామోదరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎమ్.డి. గయాజుద్ధిన్, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారి ఎస్.కృష్ణ, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహన్ రావు, సివిల్ సప్లరు మేనేజర్ ఎమ్.దేవుళ్ళ నాయక్, ఎటిడబ్ల్యుఒ బి.సురేష్ కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కె.ఆర్.రాజు, జిల్లా ఆహార భద్రత అధికారి వై.రామారావు, ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎల్ పాత్రుడు, ఎస్.సంధ్యా రాణి, సిహెచ్ శ్రీనివాసరావు, ఎన్‌పిహెచ్‌ఒ జోగిబాబు, పిహెచ్‌సి వైద్యులు పిఎ ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.










