Mar 15,2023 21:36

ప్రజాశక్తి - ఏలూరు
           వినియోగదారుని ప్రయోజనాన్ని పరిరక్షించి, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కల్పించిన చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండటం అందరి బాధ్యతని జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు వి.శ్రీనాగలక్ష్మి, జిల్లా వినియోగదారుల సంఘం ప్రతినిధులు కట్టా సత్యనారాయణ, కె.రామచంద్రరావు, డాక్టర్‌ విజయకష్ణ తదితరులను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డిఎస్‌ఒ ఆర్‌ఎస్‌ఎస్‌.సత్యనారాయణరాజు మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో పౌర సరఫరాల శాఖ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందన్నారు. వి.శ్రీనాగలక్ష్మి మాట్లాడుతూ వస్తువుల నాణ్యత ఇతర వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందన్నారు. వార్షిక ఆదాయం తక్కువున్న వారు విద్యా అడ్వాన్స్‌ తీసుకున్న సమయంలో వడ్డీ రాయితీ గురించి ముందస్తుగా బ్యాంకర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. కట్టా సత్యనారాయణ, కె.రామచంద్రరావు, డాక్టర్‌ విజయకృష్ణ తదితరులు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టంలోని పలు అంశాలను వివరించారు. వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చన్నారు. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందన్నారు. తూనికలు కొలతలు శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ హరిప్రసాద్‌, వాణిజ్య పన్నుల శాఖ డిసిటిఒ జె.శ్రీనివాసరావు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.సునీత, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ కె.రామరాజు, ఎపిఇపిడిసిఎల్‌ డిఇ ప్రసాద్‌, తదితరులు వినియోగదారుల పరిరక్షణకు సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ డి.ఆశ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ మంజుభార్గవి, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ కె.వెంకటేశ్వరరావు, ఎల్‌డిఎం ఎస్‌ఎస్‌ఎ.వెంకటేశ్వరరావు, జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యదర్శి బి.బెన్నీ పాల్గొన్నారు.