ప్రజాశక్తి-హుకుంపేట:పెట్రోల్, గ్యాస్ వినియోగ దారులకు నాణ్యమైన సేవలందించాలని ఐటిడిఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ ఆదేశించారు. స్వచ్ఛత, నాణ్యతల పరమాణం పక్కాగా అమలు చేయాలన్నారు. మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్, గ్యాస్ గొడౌన్ లను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. కార్యాలయాల రికార్డులను, క్రయ విక్రయాల నమోదులు, ఆదాయ వ్యయాలను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ బంకులో ఉన్న అదనపు గదిలో జిసిసి ఉత్పత్తులు విక్రయించాలని సూచించారు. మరుగుదొడ్లు మరమ్మతులు చేపట్టాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. భద్రతా చర్యలపై ఆరా తీసారు. పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గిరిజన సంక్షేమశాఖ సహకార సంస్థ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. వాష్ రూములు , విశ్రాంతి గదుల మరమ్మతులు చేపట్టాలన్నారు. పెట్రోల్ బంకు దగ్గర వెంటనే గాలి పంపును ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసారు. మండలంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిసిసి డిఎం కె.పార్వతమ్మ, తాహశీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపిడిఓ ఆర్.వెంకటరావు, జిసిసి సిబ్బంది చిరంజీవి పాల్గొన్నారు.










