May 18,2023 20:10

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టి నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.హనుమంతు, మండల అధ్యక్షులు మధు రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం రైతు సంఘం అధ్వర్యంలో స్థానిక మండల వ్యవసాయ కార్యాలయంలో ఎంపిఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతేడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల మండలంలో వేల ఎకరాల పత్తి పంట దెబ్బతినిందని తెలిపారు. రైతులకు పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీమా కూడా రాక రైతులు నష్టపోయారని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలు అమ్ముతున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌బికెలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు సంఘం నాయకులు తిప్పన్న, రాందాస్‌, మహానంది, చెన్నయ్య, బసి రెడ్డి, తిమ్మన్న, నాగన్న పాల్గొన్నారు.