ప్రజాశక్తి-కె.కోటపాడు
ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి చేపట్టి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి ప్రభాకర్ రావు తెలిపారు. శనివారం కింతాడ గ్రామంలో మామిడి రైతులతో సమావేశమై పండ్లకు రక్షణ కలిగించే కాగితపు సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పండ్లతోటల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిమ్మకాయ పరిమాణంలో ఉన్న మామిడికాయలను ఎంపిక చేసుకుని ఫ్రూట్ కవర్లు తొడగాలన్నారు. కాయలకు ఎటువంటి తెగుళ్లు సోకకుండా మంచి నాణ్యమైన పండ్ల దిగుబడికి ఈ సంచులు తోడ్పడతాయని చెప్పారు. ఈ విధంగా మగ్గిన పండ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతుందన్నారు. ప్రస్తుతం రైతులు కాయ రంగు పెంచేందుకు రకరకాల కార్బైడ్ రసాయనాలు వాడుతున్నారని, వాటి వల్ల ప్రజలకు ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. జిల్లాలో 400 మంది రైతులను ఎంపిక చేసి రెండు వందల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా కాగితపు సంచులను 50 శాతం రాయితీపై పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు కిరణ్మయి, గణేష్, స్థానిక వ్యవసాయ అధికారి సోమశేఖర్, సర్పంచ్ బండారు ముత్యాల నాయుడు, ఉద్యానవన శాఖ సహాయకులు పాల్గొన్నారు.










