Apr 25,2023 22:47

రాజపూడిలో గుడ్లు రీప్లేస్‌ చేస్తున్న పౌల్ట్రీ నిర్వాహకులు

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ప్రజాశక్తిలో మంగళవారం ప్రచురతమైన 'గుడ్డు వెరీ బ్యాడ్‌' కథనానికి ఐసిడిఎస్‌ అధికారులు స్పందించారు. నాణ్యతల గుడ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుం టున్నామని జగ్గంపేట ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సిడిపిఒ ఎం.పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న రంగంపేట ఐసిడియస్‌ ప్రాజెక్టు సమావేశంలో జగ్గంపేట మండలం రాజపూడి -2, మల్లిసాల -3, గండేపల్లి మండలంలోని జెడ్‌.రాగంపేట కేంద్రాలకు సరఫరా చేసిన గుడ్లు పాడయ్యాయని అంగన్‌వాడీ కార్యకర్తలు తెలియజేసిన వెంటనే మరలా తాజా గుడ్లు సరఫరా చేయవలసిందిగా సంబంధిత సత్యా భాస్కర్‌ పౌల్ట్రీ నిర్వాహకులను ఆదేశించామన్నారు. దాంతో వారు మంగళవారం నాణ్యత గల గుడ్లు సరఫరా చేసినట్లు తెలిపారు. గుడ్లు సరఫరా చేసే ముందు ప్రతీ సారీ పౌల్ట్రీలో 3 దఫాలుగా తనిఖీ చేసి బరువు తూచి సరిగా ఉన్న తరవాత గుడ్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గుడ్లు తీసుకునే ముందు వర్కర్లు నాణ్యత, బరువు ధ్రువీకరించు కోవాలని కోరారు. గుడ్లు ఉడికించి లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో కూడా నాణ్యత సూత్రాలు పాటించి ఇవ్వాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. సప్లయి నుంచి లబ్ధిదారుకు చేరే వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షణ చేస్తున్నామని వివరణ ఇచ్చారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల కారణంగా గుడ్లు త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున కాలయాపన లేకుండా త్వరితగతిని నాణ్యమైన గుడ్లు అందేటట్లు చూస్తామని పేర్కొన్నారు.