స్నాక్స్ అనగానే మనకు టక్కున గుర్తొచేవి వెజిటేరియన్ స్నాక్స్ మాత్రమే.. అయితే నాన్ వెజ్‌ను పోలిన స్నాక్స్ రకాలూ అనేకం ఉన్నాయి. చూడ్డానికి అచ్చుగుద్దినట్లు నాన్ వెజ్ లానే ఉంటాయి. అంతేనా వీటిలోనూ నాన్ వెజ్‌లో ఉండే అన్ని పోషకాలూ ఉంటాయి. అయితే నాన్ వెజ్‌తోనూ కొన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి. ఈ రకమైన స్నాక్ ఐటమ్స్ రుచితోపాటు మంచి పోషకాలనూ అందిస్తాయి. చిన్న పిల్లలైనా, పెద్దవారైనా ఈ స్నాక్స్‌ని లొట్టలేసుకుంటూ తింటారు. బయటి చిరుతిండ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి ఆహారాన్నే ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి..మరికెందుకు ఆలస్యం ఆ రుచికరమైన స్నాక్ ఏంటో? వాటిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..!
చికెన్ షవర్మా రోల్
కావాల్సిన పదార్థాలు : చికెన్ - అరకిలో, పెరుగు - అరకప్పు, వెల్లుల్లి పేస్టు - స్పూన్, మిరియాల పొడి - అరస్పూన్, కర్రీ పౌడర్ - అరస్పూన్, దాల్చిన చెక్క పొడి - అర స్పూన్, ఉప్పు - తగినంత, నిమ్మకాయలు - రెండు, నూనె - స్పూన్, ఉల్లిపాయలు - కొద్దిగా, పచ్చిమిర్చి, టమోటో - రెండు, రుమాల్ రోటీ - నాలుగు.
సాస్ కోసం : పెరుగు - అరకప్పు, నిమ్మరసం - కొద్దిగా, తాహిని - స్పూన్, ఉప్పు - తగినంత, వెల్లుల్లి పేస్టు - స్పూన్.
తయారుచేసే విధానం :
- ఒక పాత్రలో చికెన్ తీసుకొని పెరుగు, వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కర్రీపౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి నాలుగు గంటల పాటు పక్కన పెట్టాలి.
- పాన్‌లో నూనె వేసి చికెన్ ముక్కలను వేగించాలి.
- ఇప్పుడు రుమాల్ రోటీని తీసుకుని మధ్యలో చికెన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమోటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రోల్ చేయాలి.
- మరొక పాత్రలో పెరుగు, నిమ్మరసం, తాహిని, ఉప్పు, వెల్లుల్లిపేస్టు వేసి బాగా కలిపి సాస్ తయారుచేసుకోవాలి. ఈ సాస్‌తో తింటే చికెన్ షవర్మా రుచిగా ఉంటుంది.
మిక్స్‌డ్ మిల్లెట్ భేల్ పూరి
కావాల్సిన పదార్థాలు : మిక్స్ మిల్లెట్ ఫ్లేక్స్ - కప్పు, రాగి ఫ్లేక్స్ - కప్పు, మరమరాలు (ఫఫ్డ్ రైస్ ఫ్లేక్స్) - మూడు కప్పులు, వేరుశనగలు - అరకప్పు(వేగించినవి), అమర్‌నాథ్, కారప్పూస - అరకప్పు, ఛాట్ మసాలా - రెండు స్పూన్లు, నల్ల నువ్వులు - మూడు స్పూన్లు, బంగాళదుంపలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, టమోటాలు - రెండు, నిమ్మరసం - నాలుగు స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, గ్రీన్ చట్నీ - మూడు స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, మునగాకు పొడి - మూడు స్పూన్లు.
తయారుచేసే విధానం :
- ముందుగా బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఒక పాత్ర తీసుకుని అందులో మిక్స్ మిల్లెట్స్, రాగి ఫ్లేక్స్, మరమరాలు, వేగించిన వేరుశనగలు, అమర్‌నాథ్, కారప్పూస వేసి కలుపుకోవాలి.
- తర్వాత ఛాట్ మసాలా చల్లుకుని, నల్ల నువ్వులు వేసుకోవాలి.
- అందులోనే బంగాళదుంప ముక్కలు, టమోటో ముక్కలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు మునగాకు పొడి, గ్రీన్‌చట్నీ వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.
ఛీజ్ బాల్స్
కావాల్సిన పదార్థాలు : బంగాళదుంపలు - మూడు, ఛీజ్ - అరకప్పు, మిరియాల పొడి - పావుస్పూన్, జీలకర్ర పొడి - అరస్పూన్, గరంమసాల - చిటికెడు, కొత్తిమీర - కట్ట, శనగపిండి - నాలుగు స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారుచేసే విధానం :
- ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. తర్వాత పొట్టు తీసి, ఒక బౌల్‌లోకి మార్చుకుని గుజ్జుగా చేసుకోవాలి.
- అందులోనే మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాల, కొత్తిమీర, శనగపిండి వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు ఛీజ్ వేసి, తగినంత ఉప్పు వేసి మళ్లీ కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా తయారుచేసుకోవాలి.
- స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి, వేడయ్యాక చీజ్ బాల్స్ వేసి వేయించుకోవాలి.
- ఒకవేళ బాల్స్ నూనెలో వేయగానే విరిగిపోతున్నట్లయితే ఇంకాస్త శనగపిండి కలుపుకోవాలి.
- ఈ చీజ్ బాల్స్‌ను టమోటో కెచప్‌తో లేదా పుదీన చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
చికెన్ సమోసా
కావాల్సిన పదార్థాలు : ఉడికించిన చికెన్ - 450 గ్రా, ఉల్లిపాయలు - రెండు పెద్దవి, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం తరుగు - రెండు చెంచాలు, పసుపు - పావుస్పూను, మిరియాల పొడి - అరస్పూను, చికెన్ మసాలా - రెండు స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, మైదా - ఒకటిన్నర కప్పు, గోరువెచ్చని నీళ్లు- పిండి కలిపేందుకు సరిపడా.
తయారుచేసే విధానం : ఒక గిన్నెలోకి మైదా తీసుకుని కొద్దిగా ఉప్పు, స్పూను నూనె వేసి కలపాలి. అందులోనే నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి గోధుమ రంగులోకి మారాక అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు వేయాలి.
- రెండు నిమిషాలయ్యాక పసుపు, మిరియాలపొడి, చికెన్ మసాలా, సన్నగా కోసిన చికెన్ వేయాలి. చికెన్ కాస్త మెత్తబడ్డాక తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి దించేయాలి. దాన్ని చల్లారనివ్వాలి.
- నానిన మైదాపిండిని చపాతీలా చేసి నిలువుగా కోయాలి. అందులో ఒక భాగాన్ని త్రికోణాకృతిలో చుట్టి రెండు స్పూన్‌ల చికెన్ మసాలాను ఉంచి సమోసా ఆకృతిలో చేసుకుని అంచులు మూసి వేయాలి.
- ఇలా చేసుకున్న వాటిని రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసెయ్యాలి. అంతే చికెన్ సమోసా రెడీ.