ప్రజాశక్తి-పాచిపెంట : నానో యూరియా వినియోగంతో పంటకు ఎంతో మేలని మాతుమూరు గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శనగల సింహాచలం తెలిపారు. శుక్రవారం మాతుమూరు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎక్కువ మోతాదులో భూమిలో ఎరువులు వెయ్యడం వల్ల భూమి సారం తగ్గిపోతుందన్నారు. పంటపై పిచికారీ చేసుకునే అవకాశం ఉన్న నాను యూరియా రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పురుగుమందులో కలిపి కూడా పిచికారి చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. అనంతరం విఎఎ దినేష్‌కుమార్.. అజోల్లా ఉపయోగాలు, కల్తీ పురుగుమందులను గుర్తించడంపై వీడియోలను ప్రదర్శించారు. అనంతరం ప్రకృతి సేద్య సిఆర్‌పి తిరుపతి నాయుడు ద్రవ జీవామృతం తయారీకి ఉపయోగపడే సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు పాల్గొన్నారు
అందుబాటులో ఎరువులు
సీతానగరం : రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఎఒ ఎస్.అవినాష్ తెలిపారు. మండలంలోని ఇప్పలవలస రైతుభరోసా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-పంట నమోదు జిపిఎస్ ఆధారంగానే జరుగుతుందని అన్నారు. కౌలుకార్డులు తీసుకోవాలన్నారు. కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. సమావేశంలో ఎంపిటిసి గొల్ల శాంతకుమారి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పాల ఈశ్వర్ నారాయణ పాల్గొన్నారు.










