Aug 31,2023 22:36

నానో యూరియాపై రైతులు విముఖత
సొసైటీ, రైతుభరోసా కేంద్రాల్లో బలవంతంగా అంటగట్టేందుకు యత్నం
ఎరువుల సబ్సిడీ నుంచి తప్పుకునేందుకు మోడీ సర్కార్‌ కుట్ర
శాస్త్రీయంగా నిరూపణ కాకుండానే మార్కెట్‌లోకి
2021 నుంచి జిల్లాలో 7,070 నానో బాటిల్స్‌ మాత్రమే కొనుగోలు


ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : రైతులకు అందిస్తున్న ఎరువుల సబ్సిడీ నుంచి తప్పుకునేందుకు కేంద్రం కుటిల యత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రీయంగా నిరూపణ కాని నానో యూరియాను రైతులపై బలవంతంగా రుద్ధేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గుడ్డిగా సమర్ధిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. నానో యూరియా సక్రమంగా పనిచేయడం లేదంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ రంగంలో యూరియా వాడకానికి ప్రత్యేకత ఉంది. జిల్లాలో అత్యధికంగా వరి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌, పొగాకు వంటి పంటలను రైతులు సాగుచేస్తున్నారు. యూరియా వాడకం జిల్లాలో పెద్దఎత్తున ఉంటుంది. యూరియా ఎరువు పలుకులుగా ఉంటుంది. 45 కిలోల బస్తా ఖరీదు రూ.266 వరకూ ఉంది. యూరియాను ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందిస్తూ ఉంటుంది. మోడీ సర్కార్‌ వచ్చాక కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను విపరీతంగా పెంచింది. యూరియా సబ్సిడీని ఎత్తివేస్తే రైతులనుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, నానో యూరియాను తెరపైకి తెచ్చింది. ఇది లిక్విడ్‌ రూపంలో ఉంటుంది. యూరియాను రైతులు ఖరీఫ్‌లో ఎకరాకు బస్తాన, దాళ్వాకు మూడుబస్తాల వరకూ వాడతారు. పంట ఏపుగా పెరగడానికి యూరియా ఎరువు కీలక పాత్ర పోషిస్తోంది. యూరియా స్థానంలో బస్తాకు 500 మిల్లీలీటర్లు చొప్పున నానో యూరియా వాడేవిధంగా రూపొందించినట్లు చెబుతున్నారు. నానో యూరియా అరలీటర్‌ ఖరీదు రూ.240 వరకూ ఉంది. దీన్ని బలవంతంగా రైతులకు అంటగట్టేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. సొసైటీలు, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అంటగట్టేందుకు చూస్తున్నారు. 2021-22లో 1,176 అరలీటర్‌ బాటిళ్లు, 2022-23లో 3,648 బాటిళ్లు, ప్రస్తుత ఖరీఫ్‌లో 2,246 బాటిళ్లను మాత్రమే సొసైటీలు, రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించారు. కాంప్లెక్స్‌ ఎరువులు కావాలంటే నానో యూరియా బాటిల్‌ తీసుకోవాలంటూ నిబంధన పెట్టి మరీ పలుచోట్ల అంటగడుతున్నారు. తీసుకువెళ్లిన రైతులు వాడినా పెద్దగా ఫలితం లేకపోవడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. పలుకులతో కూడిన యూరియానే బాగా పనిచేస్తుందని రైతులు చెబుతున్నారు. సబ్సిడీ నుంచి తప్పుకునేందుకు నానో డిఎపిని కూడా కేంద్రం తెచ్చిన పరిస్థితి ఉంది. ఇది ఇంకా జిల్లాలోకి రాలేదని తెలుస్తోంది. నానో యూరియా వల్ల చాలా ఉపయోగాలున్నాయంటూ ఆయాశాఖల అధికారులు చెబుతున్నారు. శాస్త్రీయంగా నిరూపితంకాని నానోయూరియా వల్ల ఉపయోగాలున్నాయని ఏ విధంగా చెబుతారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నానో యూరియాను వాడేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. శాస్త్రీయంగా నిరూపితం కాని నానో యూరియాను రైతులకు ఇవ్వాలని చూడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు ముందుకు రాకపోవడంతో అధికారులకు ఏంచేయాలో తెలియక మదనపడుతున్నారు. నానో యూరియాను శాస్త్రీయంగా నిరూపితమైన తర్వాత మార్కెట్లోకి తీసుకురావాలే తప్ప బలవంతంగా అంటగట్టకూడదని రైతులు అంటున్నారు.