Aug 29,2021 07:22

అమ్మ అన్న పదం ఎంత తీయనైనది. అలా ఎవరైనా పిలిచే కొద్దీ వినాలనిపిస్తుంది. నాకు కూడా ఎవరినైనా అలా పిలవాలని అనిపిస్తుంది. అమ్మ అవ్వగానే స్త్రీకి పరిపూర్ణత్వం లభించి ఇక ఆమె పసిబిడ్డే తన ప్రపంచం అనుకుంటుందనీ అందరూ అంటారు. కానీ మా అమ్మ అలా కాదు. నేను పసిదానిగా ఉన్నప్పుడే నన్ను, నాన్నని వదిలేసి ఎవరో ఒకతనితో వెళ్లిపోయింది. దీంతో నాకు ఎవరినీ 'అమ్మా' అని పిలిచే అవకాశమే లేదు, కలగలేదు. స్కూలుకి వెళ్లినప్పుడు అమ్మలందరూ పిల్లలని తరగతిలో దింపేటప్పుడు బుగ్గలపై ముద్దులు కురిపించి వెడుతుంటే, అమ్మలని వదిలి లోపలకి వెళ్లే పిల్లలు ఏడుపు అందుకోవడం నేను ఉత్సుకతతో చూసేదాన్ని. కానీ నేను మాత్రం ఆటో అంకుల్‌ దింపి వెడుతుంటే ఆరిందలా మౌనంగా క్లాసులోకి నడిచేదాన్ని. ఈ విషయం ఆటో అతను నాన్నకు వర్ణించి.. వర్ణించి.. చెబుతూ ఉండేవాడు.
'పాపగారు చాలా బుద్ధిమంతురాలండి. బడిలో దింపినపుడు అసలు ఏడవనే ఏడవరు. మిగిలిన అందరూ ఎంతో గోలగోల చేస్తారండి' అనేవాడు. అప్పుడు నాన్న నన్ను ఎత్తుకుని, ముద్దాడుతూ నిశ్శబ్దంగా కళ్లత్తుకునేవారు. నేను ఒక విషయానికి మాత్రం నాన్నను బాగా వేధించేదాన్ని.
'నాన్నా, అందరికీ అక్కో, అన్నో, చెల్లాయో ఉన్నారు. నాకు మాత్రం ఎవరూ లేరెందుకు' అని నిలదీస్తుంటే నాన్న చాలాసేపు మాట్లాడేవారు కాదు. మళ్ళీ నేనే 'సారీ నాన్నా ఇక అడగనులే, మాట్లాడు ప్లీజ్‌' అనగానే నవ్వేసి మామూలుగా అయిపోయేవారు.
కాస్త పెద్దయ్యాక నాకు కొన్ని కొన్ని విషయాలు అర్థమవ్వడం మొదలైంది. విజరు అంకుల్‌ లలితాంటీ నెలకోసారి ఇంటికి వచ్చి 'ఎన్నాళ్లు ఇలా అన్నీ కోల్పోయినట్టు దానినే తలచుకుని ఉంటావు చెప్పు. నువ్వు ఊ.. అను మంచి మంచి అమ్మాయిలు నిన్ను చేసుకోవడానికి క్యూలో రెడీగా ఉన్నారు. నీ కోసం కాదు, కానీ స్వప్నకి తల్లి కావద్దూ' అంటుంటే నాన్న ససేమిరా అనేవారు.
కానీ నాన్న అప్పుడప్పుడు రాత్రులు దిగాలుగా కూర్చుని తన మొబైల్‌ ఫోన్‌లోకి చూస్తూ ఉండిపోయేవారు. అదేమిటో చూడాలని నేను ప్రయత్నించినా ఆయన ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ అయ్యేది కాదు, నాకు ఆయనను అడిగే ధైర్యమూ లేదు. ఒకసారి అర్ధరాత్రి ఆయన ఫోన్‌ చూస్తుంటే నాకు మెలకువ వచ్చి కళ్లు తెరిచాను. నా వైపు చూడని ఆయన, తన ఫోన్‌ నా మంచంపైన పెట్టి బాత్రూమ్‌లోకి వెళ్లారు. అప్పుడు నేను ఫోన్‌ లాక్‌ అవ్వకమునుపే గబగబా ఆయన ఏం చూస్తున్నారా అని చూశాను. అక్కడ ఆమె, నేను, నాన్న కలిసి తీసుకున్న ఫొటో ఉంది. పాపం నాన్నకి ఆమె అంటే ఎంతో ఇష్టమని, ఆమెను మర్చిపోలేక తనలో తాను కుమిలిపోతున్నారని నా చిన్న బుర్రకు అర్థమైంది. నాన్నను వదిలేసి పోయిందనే బాధతో ఆ వయసులో నాకు ఆమె మీద చాలా కోపం వచ్చేది. అయినా నాన్న నాకు అమ్మ లేదనే లోటే తెలియనివ్వకుండా అన్నీ అమర్చిపెట్టేవారు.
ఇంటర్‌లో జాయిన్‌ అయినప్పటి నుండి నేనే వంట దగ్గర నుంచి అన్ని పనులూ చేసేదాన్ని. 'నువ్వు హాయిగా చదువుకోరా చిన్నారీ, నీకు ఎందుకు ఈ పనులన్నీ' అని నాన్న అడ్డం పడుతున్నా నేను వినేదాన్నికాదు. ఆయనకు ఇది వరకటి ఓపిక తగ్గిపోవడం నాకు తెలుస్తూనే ఉంది. నాన్నకి దగ్గరుండి అన్నం వడ్డించినప్పుడల్లా 'నువ్వు నాకు అమ్మవిరా చిన్నారీ' అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకునేవారు.
ఒకసారి బయట ఫ్రెండ్స్‌ దగ్గర అమ్మల గురించిన ఏదో డిస్కషన్‌ వచ్చింది. అందరూ వాళ్ల అమ్మలు తమకు ఎన్ని సేవలు చేస్తారో, తాము అమ్మలని ఎలా ఆట పట్టిస్తారో వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ సడన్‌గా 'పాపం మన స్వప్నకి ఇవన్నీ తెలియవు కదా, ఇబ్బంది పడుతుందేమో...' అంటూ నా వైపు దృష్టి నిలిపారు. నాకు గిర్రున కళ్లలో నీరు తిరిగింది. అది కనపడకుండా జాగ్రత్తపడుతూ ఒక ఐదు నిముషాలు వాళ్లతో ఉండి తిన్నగా ఇంటికి వచ్చేశాను. ఇటువంటి అనుభవం చాలాసార్లు అయినా ఈసారెందుకో చాలా చాలా బాధనిపించింది. ఆమె మీద పిచ్చి కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో నాన్న దగ్గర ఆమె గురించి విసురుగా ఏదేదో అనేశాను. నాన్న కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండగానే నేను నోరు జారినందుకు సిగ్గుపడి 'నాన్నా క్షమించవా ప్లీజ్‌' అని చిన్నపిల్లలా నాన్న ఒడిలో ఒదిగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాను. నాన్న మాత్రం ఎంతో శాంతంగా నా తల నిమురుతూ 'నీ కోపంలో తప్పు లేదురా తల్లీ, బహుశా అమ్మలేని లోటును నేను పూర్తిగా భర్తీ చేయలేకపోయానేమో' అన్నారు. 'అయ్యో అలాంటిదేమీ లేదు నాన్నా' అని నేను గాభరాపడి బయట అందరూ మాట్లాడినవి వివరించాను.' లోకం ఇలాంటి వాటికి ఎలా స్పందిస్తుందో నాకు తెలుసురా, అయినా మన జీవితం మన ఇష్టం. మనకి ఎవరి సానుభూతీ అవసరం లేదు కదా. వారి సానుభూతి మనలను ఏ అవసర సమయంలోనూ ఆదుకోదు. అయినా ఆమెకు కావాల్సిందేదో నా దగ్గర దొరకలేదు. అందుకే వెళ్లిపోయింది. ఆమె ఏం చేసిందని అందరూ ఆమె లేనప్పుడు నా దగ్గర ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చెప్పు. ఆమెకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది' అన్నారు. 'ఇంత అద్భుతమైన మనసున్న ఇటువంటి తండ్రి దొరకడం నిజంగా నా అదృష్టం. తనను, తనకు పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన ఆమె గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడానికి ఎంత పెద్ద మనసు కావాలి' అనుకుని నేను మళ్లీ ఎప్పుడూ ఆ టాపిక్‌ ఆయన ముందు ఎత్తలేదు.
నాన్న నన్ను ప్రతీ ఆదివారం ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లేవారు. బహుశా అమ్మానాన్నా లేని వారి కన్నా నా పరిస్థితి ఎంత మెరుగో నాకు తెలియజేయడానికేమో అనిపించేది. నాకు మాత్రం వారిని చూస్తే గుండె పిండేసినట్టు అనిపించేది. నేను, నాన్న వారితో భోజనం చేసి చాలాసేపు వారితో సమయం గడిపి వచ్చేవాళ్లం. వారికి కావాల్సినవి కనుక్కుని మళ్ళీ వారం కొనుక్కుని వెళ్లేవాళ్లం. మమ్మల్ని చూడగానే, ముఖ్యంగా నాన్నను చూడగానే వారి ముఖాలన్నీ పూలలా విప్పారేవి. నాన్న కళ్లు ఎప్పుడూ దయతో, ప్రేమతో జ్యోతులలా వెలుగుతూ ఉండేవి. నాన్న కళ్లలోకి చూస్తూ ఎవరైనా ఎంత సమయమైనా గడిపేయచ్చు. ఎంతటి రాతి హృదయులైనా ఆయన ముఖంలోకి చూస్తే కరిగిపోతారేమో అని నాకు అనిపిస్తుంటుంది. నాన్నతో గడిపే క్వాలిటీ టైం మరెక్కడా నాకు దొరకదు.
ఈలోగా నాకు కేంపస్‌ సెలక్షన్‌లో మంచి పాకేజ్‌తో ఉద్యోగం వచ్చింది. సెలక్టెడ్‌ అని తెలియగానే ఫ్రెండ్స్‌ అందరూ పార్టీ ఇవ్వమని లేదా సినిమాకు అయినా తీసుకెళ్లమని ఎంత బలవంతపెట్టినా, నేను మరోరోజు తీసుకెడతానని చెప్పి పరుగు పరుగున ఇల్లు చేరి నాన్నకు చెప్పాను. నాన్న ఎంతో ఆనందపడిపోతూ 'నా చిట్టితల్లి అప్పుడే ఎంత ఎదిగిపోయిందో' అన్నారు తడి కళ్లతో. 'ఇక నువ్వు ఏమీ కష్టపడడానికి వీల్లేదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుండీ ఇంటిని ఫైనాన్స్‌ విషయాలతో సహా అంతా నేనే చూసుకుంటాను నాన్నా, నీకు ఇక నుండీ అంతా రెస్ట్‌' అన్నాను. 'ఓహో ఇక మీదట నుండీ నువ్వేనా నాకు బాస్‌, చిత్తం మేడమ్‌' అన్నారు అల్లరిగా నవ్వుతూ. అవునవును అంటూ నేను కూడా ఎంతో ఆనందంగా నవ్వులో శృతి కలిపాను.
పరీక్షలు అయిపోయి రిజల్ట్స్‌ కూడా వచ్చేసి ఇక ఉద్యోగంలో చేరేందుకు కొన్నాళ్ల సమయం ఉంది. ఒక రోజు నేను బద్ధకంగా మంచం మీద పడుకుని, నాన్న నా మంచం పక్కన కుర్చీలో కూర్చుని టీవీలో 'ఆకాశమంత' అనే సినిమా చూస్తున్నాము. ఆ సినిమా నాకూ నాన్నకూ చాలా చాలా ఇష్టం. అందులో త్రిషాను ఒక్క క్షణమైనా వదలలేని తండ్రి పాత్రలోని ప్రకాష్‌ రాజ్‌ను చూపించి 'నాన్నా అది నువ్వే' అని నేను ఆటపట్టిస్తుంటే, నాన్న ఉడుక్కునట్టు ముఖం పెట్టి 'నీకు కావలసినంత స్వేచ్ఛ ఇవ్వలేదా చిన్నారీ' అంటుంటే నేను పకపకా నవ్వాను. అప్పుడు నాన్న కూడా నవ్వేశారు. అలా సరదాగా సినిమా చూస్తూ నేను నిద్రలోకి ఎప్పుడు జారిపోయానో నాకే తెలీదు.
ఇంతలో నాకు అనుకోకుండా మెలకువ వచ్చింది. బెడ్‌ రూమ్‌కు ఒక పక్కగా ఉన్న హాల్‌లోంచి ఏవో మాటలు నాకు వినబడసాగాయి. ఎవరిదో కొత్త గొంతు 'ఇక నన్నూ, నా కూతురినీ మీరే పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలి. నేను ఉన్నట్టుండి ఒంటరిదాన్ని అయిపోయాను. మీ వంటి మంచి మనసున్న మారాజును వదలిపోయిన నేను చాలా దుర్మార్గురాలిని. నా పాపానికి నిష్కృతి లేదు' అంటూ దు:ఖంతో పూడుకుపోయిన కంఠంతో అంటోంది. నాన్న మాత్రం ఎంతో మృదువైన గొంతుతో 'అయ్యో నువ్వు ఏడవకు ధైర్యంగా ఉండు' అంటున్నారు. నాకు ఎవరొచ్చారో అర్థమై ఒక్కసారిగా మతిపోయింది. ఆమె మళ్లీ 'మిమ్మల్ని పాపను ఎంత ఇరకాటంలో పెట్టానో నాకు తెలుసు. ఏదో మాయ కమ్మేసి అతడితో వెళ్లిపోయి మీకు తలవంపులు తెచ్చే పని చేశాను. నాలుగు రోజుల తరువాత నా మనస్సాక్షి నన్ను దహించి వేసినా ముఖం చెల్లక తిరిగి రాలేకపోయాను. అలాగని అతడితో నేను సుఖపడిందీ లేదు. నన్ను నిత్యం సూటిపోటి మాటలతో హింసించేవాడు. మిమ్మల్ని మోసం చేసినట్టే తననీ మోసం చేస్తానేమో అని నిత్యం అనుమానపు చూపులతో కుళ్లబడిచేవాడు.
అతడి తప్పు మాత్రం ఏముంది. నేనేగా గుడిలాంటి ఇంటిని వదలి రోడ్డున పడి తంపులు తెచ్చుకున్నది. ఇదంతా నా స్వయంకృతాపరాధం. ఇప్పుడు అతడు లేడు. తాగీ తాగీ లివర్‌ పాడై చచ్చిపోయాడు. పోయే ముందర మీ గురించి మాట్లాడుతూ, మీకు అన్యాయం చేసినందుకు తన తరపున నన్ను క్షమాపణ అడగమన్నాడు. ఒకసారి బజారులో ఎక్కడో కనబడినపుడు నేను ఎలా ఉన్నానని మీరు అడిగితే అతడు సమాధానం చెప్పకుండా వచ్చేసిన విషయం కూడా చెప్పాడు. తన కూతురిని మీ దగ్గరకు చేర్చి ఒక దారి చూపించమని మిమ్మల్ని వేడుకోమన్నాడు.' ఇక అంది. నాన్న 'అయ్యో అతడు పోయాడా పాపం, నువ్వు బాధపడకు. నీ కూతురిని చదివించి పెద్ద చేసే బాధ్యత నాదే. నువ్వు నీ పాపని తీసుకుని రేపో ఎల్లుండో నా దగ్గరకు వచ్చేయి. మన అమ్మాయి ఏమంటుందో అనే సందేహం వద్దు. నేను తనకి చెప్తాను. నువ్వు ఏ మాత్రం సందేహించకుండా ఇక్కడకు వస్తే అటు పక్క గది ఖాళీ చేస్తాను' అంటూ ఆమెను తన చల్లని మాటలతో ఓదారుస్తూ నచ్చజెప్తున్నారు.
నాన్న ఆమెను అలా క్షమించడం చూసి నా తల తిరిగిపోసాగింది. నాన్న నిజంగా దేముడు. ఇటువంటి మంచి మనుషులుండబట్టే ఈ మాయదారి లోకం ఇలా ఇంకా మిగిలి ఉంది. ఈ తండ్రికి పుట్టిన నేను ఎంతో అదృష్టవంతురాలిని అనుకుంటూ ఎంతో గర్వంగా అనిపించింది. ఈ ఆలోచనలతో మునిగిన నేను కళ్లు మూసుకుని అలా పడుకునే ఉండిపోయాను. ఆమె కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది.
ఈ విషయమంతా తెలిసినా నేను ఏమీ తెలియనట్టే ఊరుకున్నాను. నాన్న కూడా ఇంకా నాతో ఏమీ అనలేదు. నెమ్మదిగా నాకు వివరిద్దామని అనుకున్నారేమో మరి. నేను కూడా ఆయన చెప్పేవరకూ ఆగుదామని ఊరుకున్నాను. ఇది జరిగిన రెండు రోజులకు నేను ఉదయాన్నే డికాషన్‌ వేసి నాన్న నిద్ర లేచి గది బయటకు వస్తే కాఫీ ఇద్దామని హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్నాను. నాన్న ఎంతకీ బయటకు రావట్లేదు. ఇంతసేపు ఎప్పుడూ నిద్రపోరు. వంట్లో బాగా లేదా ఏమిటి అనుకుంటూ వెళ్లి తట్టి లేపుదామని ప్రయత్నించాను. నాన్న శరీరంలో కదలిక లేదు సరికదా చల్లగా తగిలింది. నాకు అదో పెద్ద షాక్‌.
అదేమిటి నాన్న మాట మాత్రంగానైనా నాకు చెప్పకుండా అలా ఎలా నన్ను హఠాత్తుగా వదిలేసి వెళ్లిపోయారు. కలగాపులగంగా ఆలోచనలూ, విపరీతమైన దు:ఖం నన్ను కుదిపేస్తున్నా నా కంటి వెంట అదేమిటో ఒక్క కన్నీటిచుక్కా రాలలేదు. నాన్న లేకపోవడం నా మనసులో ఎంతకీ ఇంకట్లేదు. కానీ ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపించింది. నాన్న స్నేహితుల చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ చకచకా అయిపోయాయి. ఆమె వచ్చి దూరం నుండి చూసి కళ్లత్తుకుని వెళ్లిపోయింది. నాకు ఏమిటో ఎవరితోనూ ఒక్క మాటా మాట్లాడదామని కూడా అనిపించలేదు. ఆఫీసుకు కొన్ని రోజులు సెలవు పెట్టేశాను.
నాన్న పోయి అప్పుడే పదిహేను రోజులు అయిపోయాయి. వచ్చిన వాళ్లందరూ నాకు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాక ఒంటరిగా ఇంట్లో మిగిలాను. ఎవరైనా ఎన్నాళ్లుంటారు, ఎవరి జీవితపు పరుగులు వాళ్లవి. నాన్న ఫొటో చేతుల్లోకి తీసుకుని చూస్తుంటే ఆయన ఫొటోలోంచి నా వైపు చూస్తూ చల్లగా నవ్వుతున్నట్టు అనిపించింది. ఆయనను రెప్ప వెయ్యకుండా అలా తదేకంగా చూస్తూనే ఉన్నాను. ఆయన చుట్టూ నా మనసు పరిభ్రమిస్తోంది. ఉన్నట్టుండి ఆయన నాకేదో చెప్తున్నట్టు అనిపించింది. నాకు నా కర్తవ్యం బోధపడింది.
'అవును ఆయన లేకపోతే ఏమైంది. ఆయన అందమైన నీడలో పెరిగిన నేనున్నాను కదా. ఆయన కర్తవ్యమూ, తలకెత్తుకున్న బాధ్యతో నేను నెరవేర్చాలి కదా!' అనిపించింది. అప్పటికప్పుడు డైరీలో వెతికి ఆమె నెంబర్‌ డయల్‌ చేశాను. ఇప్పుడు నాకు బాధ్యతగా చూసుకోవడానికి ఒక చెల్లెలుంది. దాంతో పాటు ఆశ్రమంలో ఉన్న పిల్లలు కూడా. ఇక నేను ఎప్పటికీ ఒంటరిని కాను అనుకున్నాను. నవ్వుతున్న నాన్న ఫొటోను గుండెలకు హత్తుకుంటుంటే నాన్న నాతోనే ఉన్నట్టు అనిపించింది.

- పద్మావతి రామభక్త, 99663 07777