Nov 15,2023 19:48

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ గీతావాణి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. ఎంపిపి బడాయి దానమ్మ అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేదు. వైస్‌ ఎంపిపి పుష్పావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు సభ్యులు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. పూర్తిస్థాయిలో ప్రతినిధులు హాజరు కాలేదు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు, ఎంపిటిసిలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు సమాధానం ఇస్తూ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంఇఒ శివరాములు మాట్లాడారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులతో పాటు వలసలు వెళ్లకుండా ఉండేందుకు అవసరమైన ప్రాంతంలో సీజనల్‌ హాస్టల్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పేరుకుపోయాయని, విద్యుత్‌ అధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు, ఎంపిటిసిలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని ఎంపిటిసిలు సభ దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు. జడ్‌పిటిసి అరుణమ్మ, హౌసింగ్‌ డిఇ రవికుమార్‌, భూ రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌ పెద్దయ్య, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు అస్లాం ఖాద్రి, మండల కోఆప్షన్‌ సభ్యులు వాదిరాజ్‌, ఇఒఆర్‌డి నాగరాజు, ఎంఇఒలు శివరాములు, శ్రీనివాసులు, ఎఇలు నాగమల్లయ్య, మాలిక్‌ బాష, షఫీవుల్లా, ఈశ్వర్‌, చెన్నయ్య, పశుసంవర్థక శాఖ వైద్యులు విజరు, ఎపిఒ చంద్రశేఖర్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్‌ లీల, సర్పంచులు రాము, వరదప్ప, నారాయణ, ప్రహ్లాద్‌ యాదవ్‌, ఎంపిటిసిలు బసప్ప పాల్గొన్నారు.