Feb 16,2023 21:33

ప్రజాశక్తి - ఏలూరు
          పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించే ఏలూరు కలెక్టరేట్‌ పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్‌ గురువారం పరిశీలించారు. ఏలూరు డిఎస్‌పి పైడేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులతో కలిసి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఆర్‌డిఒ పెంచల కిషోర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 18వ తేదీన శివరాత్రి, 19వ తేదీ ఆదివారం సెలవు రోజులు మినహాయించి ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఏలూరు కలెక్టరేట్‌ కార్యాలయంలోని రిటర్నింగ్‌ అధికారి, జెసి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, రెవెన్యూ డివిజల్‌ అధికారి నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కలెక్టరేట్‌ పరిధిలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఫ్లయింగ్‌ స్క్వాడ్ల నియామకం
పశ్చిమ గోదావరి జిల్లా స్థానికసంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌ను నియమిస్తూ రిటర్నింగ్‌ అధికారి, జెసి పి.అరుణ్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్ఛితంగా అమలు చేస్తూ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 48 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను నియమించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, మరేదైనా వస్తువుల పంపిణీని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ల నిఘా ఉంటుందన్నారు. ఈ బృందాలు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. నరసాపురం సబ్‌కలెక్టర్‌, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, భీమవరం రెవెన్యూ డివిజనల్‌ అధికారులు తమ పరిధిలోని ఫ్లయింగ్‌ స్క్వాడ్ల బృందాలను పర్యవేక్షించి డివిజన్ల వారీగా కన్సాలిడేటెడ్‌ నివేదికను ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.