Feb 21,2021 13:18

పచ్చడి.. 
కావాల్సిన పదార్థాలు:

చింతకాయలు- పావు కేజీ, పచ్చిమిర్చి- 100 గ్రాములు, తాజా కొత్తిమీర- కట్ట, జీలకర్ర- టీ స్పూన్‌, ధనియాలు- రెండు టీస్పూన్లు, వెల్లుల్లి- టీస్పూన్‌, అల్లం- చిన్నముక్క, ఉప్పు- తగినంత, ఎండుమిర్చి- మూడు, ఆవాలు- కాసిన్ని, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం :

  • చింతకాయల్ని బాగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత కాయల పక్కల నుండే ఈనెల్నీ, లోపలున్న గింజల్నీ తీసి ఆరబెట్టాలి.
  • పచ్చిమిర్చిని వేయించి చల్లారనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, చింతకాయ ముక్కలు, కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బాలి.
  • పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు పెట్టి, పచ్చడిలో కలపాలి. పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా కారం వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అంతే నోరూరించే చింతకాయ పచ్చడి సిద్ధమైనట్లే!
నాలుక్కింత చింత..!


రొయ్యలు కూర..
కావాల్సిన పదార్థాలు :

రొయ్యలు- అరకిలో, చింతకాయ ముక్కలు- 100 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూను, గరంమసాలా- టీస్పూను, కారం- రెండు టీస్పూన్లు, కరివేపాకు- రెండు రెబ్బలు, పసుపు- అర టీస్పూను, నూనె- సరిపడా, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం :

  • ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేత చింతకాయ ముక్కల్ని కొంచెం ఉడకబెట్టి, వడకట్టుకోవాలి.
  • పాన్‌లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి ఎర్రగా వేగించుకోవాలి.
  • అందులోనే ఉప్పు, కారం, పసుపు, రొయ్యల్ని కూడా వేసి కలపాలి. ఓ పది నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి.
  • రొయ్యలు మగ్గాక వడకట్టుకున్న చింతకాయ గుజ్జును పాన్‌లో వేసి బాగా కలపాలి. తర్వాత గరంమసాలా వేసి,ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, దించేసుకోవాలి.
నాలుక్కింత చింత..!


రైస్‌.. 
కావాల్సిన పదార్థాలు :

చింతకాయలు - 15 కాయలు, అన్నం - 200 గ్రాములు, శనగపప్పు, మినప్పప్పు - రెండూ కలిపి టేబుల్‌ స్పూన్‌, ఆవాలు - చెంచా, పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఇంగువ - పావుచెంచా, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, తెల్లనువ్వుల పొడి - టేబుల్‌ స్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం :

  • ముందుగా బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టుకొని, పొడిగా ఉండేటట్లు వండుకోవాలి.
  • చింతకాయల్ని తొక్కు తీసేసి అందులో రెండు పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పు, సగం పసుపు వేసి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పాన్‌లో నూనె వేడిచేసి పల్లీలు వేగించాలి. అందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చీ వేయాలి. కొంచెం వేగాక, మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, మిగిలిన పసుపు వేసుకోవాలి.
  • అన్నీ వేగాక కొద్దిగా ఉప్పు, ముందుగా తయారుచేసుకున్న చింతకాయ ముద్ద కూడా వేయాలి. అది కొద్దిగా వేగాక అందులో అన్నం వేసి బాగా కలపాలి. చివరిగా తెల్లనువ్వుల పొడి వేసి కలిపి ఓ గిన్నెలోకి తీసుకుంటే చాలు. నువ్వుల వాసన ఇష్టం లేనివారు వేయించిన వేరు శెనగపప్పును వేసుకోవచ్చు.
నాలుక్కింత చింత..!


చికెన్‌..
కావాల్సిన పదార్థాలు :

చికెన్‌- అరకిలో, టమాటా- ఒకటి (పెద్దది సన్నగా తరగాలి), ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - ఎనిమిది (చిన్నముక్కలుగా తరగాలి), పచ్చిచింతకాయ గుజ్జు- ఐదు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు, లవంగాల పొడి- ఒక్కొక్కటి పావు టీస్పూను, కారం- అర టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, నూనె- తగినంత, కొత్తిమీర- సరిపడా.
తయారుచేసే విధానం :

  • ముందుగా పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేగించాలి.
  • తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు వేసి బాగా కలిపి, కూరలోని నీళ్లు ఆవిరయ్యేంత వరకూ సన్నని మంటపై ఉడికించాలి.
  • సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పచ్చిచింతకాయ గుజ్జు ఈ మిశ్రమంలో వేసి కప్పు నీళ్లు కూడా పోయాలి.
  • కూర దగ్గరపడే వరకు స్టవ్‌ మీద ఉంచాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లాలి. వేడి వేడి అన్నంతో ఈ కూరను తింటే ఎంతో బాగుంటుంది.