
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి వరికపూడిశెల ప్రాజెక్టు గుర్తొచ్చిందని, ఎన్నికల్లో లబ్ధికోసమే తాజా శంకుస్థాపన అని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు విమర్శించారు. నరసరావుపేటలోని టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఇదే ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి వదిలేయగా టిడిపి ప్రభుత్వం రూ.340 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. అయితే ఇందులో ఒక్క రూపాయి కూడా అనంతరం వచ్చిన వైసిపి ప్రభుత్వం ఖర్చు చేయలేదని అన్నారు. టిడిపి నరసరావుపేట నియోలజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలు నిలువునా ఎండిపోతున్నా నష్ట పరిహారం ఏమీ ప్రకటించలేదన్నారు. జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి ఉండి కూడా ప్రయోజనం లేదని, నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించలేదని విమర్శించారు. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని, ఆరుతడి పంటలకు నీరు ఇవ్వడంతోపాటు రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు, వాయిదాల మీద వాయిదాలతో మభ్యపెట్టే ప్ర చారాలు తప్ప చేతల్లో చిత్తశుద్ధిలేని వరికపూడిశెల ఎత్తిపోతల శంకుస్థాపనపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. జగన్ ఇచ్చిన హామీలెన్ని.. కట్టిన ప్రాజెక్టులెన్నో చెప్పాలని ప్రశ్నించారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తండ్రి తలపెట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తానని హామీనిచ్చిన జగన్ సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారని, నాలుగున్నరేళ్లలో రెండు ప్రాజెక్టులే పూర్తి చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితే అభివృద్ధి అంటారు, ఎన్నికలకు ఆరు నెలలు ముందు శంకుస్థాపనలు చేస్తే మోసం అంటారని విమర్శించారు. టిడిపి పాలనలో సాగునీటి రంగంపై ఏటా రూ.13,600 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ వచ్చాక దాన్ని రూ.6,411 కోట్లకు తెగ్గోశారన్నారు.