Jan 05,2021 13:24

విజయవాడ : ఈ ఏడాది నాలుగు యూనివర్సిటీల ఏర్పాటుకి ప్రతిపాదనలు పెట్టామని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలం సురేష్‌ వెల్లడించారు. మంగళవారం ఎపిఎస్‌ సిహెచ్‌ఇ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలం సురేష్‌ మాట్లాడుతూ.. గడిచిన ఏడాదన్నర కాలంలో ఉన్నత విద్యామండలిలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. గత ప్రభుత్వం ఉన్నత విద్యని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకి అనుగుణంగా ఉన్నత విద్యా మండలిని తీర్చిదిద్దుతున్నామన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉన్నత విద్యలో ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు. పది నెలల ఇంటర్న్‌ షిప్‌ తో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ ప్రారంభించామన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకున్న నిర్ణయాలలో ఇది అత్యంత ప్రధానమైందన్నారు. విద్యా సంస్ధలలో అకడమిక్‌ ఆడిటింగ్‌ కోసం ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ ఎసెస్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులకి ఉపయోగపడే విధంగా ప్రతిష్టాత్మకమైన సంస్ధలతో ఉన్నత విద్యామండలి ఎంఓయుల ని కుదుర్చుకుందని తెలిపారు. కళాశాలలు, యూనివర్సిటీలలో పరిశోధనలకి పెద్ద పీట వేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో అంశాలను మొట్టమొదట అమలు చేస్తున్న రాష్డ్రం ఎపి నేనని హర్షాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలలో రీసెర్చ్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది నాలుగు యూనివర్సిటీల ఏర్పాటుకి ప్రతిపాదనలు పెట్టామని, వచ్చే క్యాబినెట్‌ లో నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలం సురేష్‌ వెల్లడించారు.