May 19,2023 00:58

ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతున్న అప్పారావు, రామకృష్ణ

ప్రజాశక్తి - మేడికొండూరు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు. మేడికొండూరు మండలం మంగళగిరిపాడు పంచాయతీ తురకపాలెంలో పని ప్రదేశాలను సంఘం నాయకులు గురువారం సందర్శించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4 వారాల నుండి కూలి డబ్బులు పడటం లేదని, పే స్లిప్పులు ఇవ్వకపోవడం వల్ల తమ ఖాతాల్లో డబ్బులు ఎంత పడ్డాయో కూడా తెలియడం లేదని వాపోయారు. పని కోసం 6 కిలో మీటర్ల దూరం వెళ్తున్నామని, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నామని, పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేవని వివరించారు. తాగునీరుకు, పనిముట్లకు అలవెన్సు, సమ్మర్‌ అలవెన్సు ఇవ్వడం లేదని చెప్పారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ కూలీలకు ఆదరువుగా ఉన్న ఈ చట్టాన్ని దెబ్బతీయడానికే బిజెపి ప్రభుత్వం పూనుకుందని, అందుకే కూలీలకు అసౌకర్యాలు కల్పిస్తోందని, పలు రకాల నిబంధనలు తెస్తోందని చెప్పారు. రెండు పూటల పని విధానం, నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం తదితరాలు అమలు చేసి కూలీలు ఎలాగైనా పనికి రాకుండా చేయడానికి కుట్రలు పన్నుతోందన్నారు. ఉపాధి హామీకి 2021-22లో బడ్జెట్‌లో రూ.90 వేలకోట్లు కేటాయిస్తే గత బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లే కేటాయించారని తెలిపారు. గతంలో 90 శాతం నిధులు కూలీలకు, 10 శాతం నిధులు యంత్రాలు కేటాయించగా ప్రస్తుతం కూలీలకు ఇవ్వాల్సిన శాతాన్ని 60 శాతానికి కుదించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని కాపాడుకోవడానికి, పటిష్టంగా అమలు చేయించుకోవడానికి కూలీలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఇందులో భాగంగా 22న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కౌరు రైతు సంఘం నాయకులు బి.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ కేరళలోని వామపక్ష ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కూలీల కోసం సంక్షేమ నిధినీ ఏర్పాటు చేసిందని తెలిపారు.