Jul 10,2023 16:20

స్పందనలో డిప్యూటీ తహశీల్దార్ మురళికి విన్నవిస్తున్న వనములపాడు గ్రామస్తులు

నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం అందడం లేదు
ప్రజాశక్తి - పగిడ్యాల

        గత నాలుగు నెలలుగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని వనములపాడు గ్రామానికి చెందిన రామ పుల్లారెడ్డి, నాగేశ్వరరావు సోమవారం నాడు స్పందన కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అంటూ తంబు వేయించుకొని వెళ్తున్నారే తప్ప ఇంతవరకు రేషన్ బియ్యం తో పాటు ఇతర వస్తువులు పంపిణీ చేసింది లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో తంబు వేయించుకొని బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని వారు అధికారులతో అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక వీఆర్వోకు అధికారులకు ఎన్నిసార్లు విన్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు నెల క్రితం ఆ షాపు డీలర్ ను సస్పెండ్ చేయడం జరిగిందని విజిలెన్స్ దాడుల్లో అక్రమంగా నిర్వహించిన నిత్యవసర సరుకులను స్వాధీనం చేసుకున్నారని అందుకోసమే మీ కోట పైనుంచి రావడంలేదని వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తామని  ఈ సర్వే డిప్యూటీ తహశీల్దార్ మురళి గ్రామస్తులకు సమాధానం ఇచ్చారు.