Feb 22,2023 22:06

ప్రజాశక్తి - ఏలూరు
          ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు బుధవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వైసిపి తరఫున జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, తణుకుకు చెందిన వంకా రవీంద్రనాథ్‌, వంకా రాజకుమారి, టిడిపి తరపున వీరవాసరం మండలానికి చెందిన వీరవల్లి చంద్రశేఖర్‌ తమ నామినేషన్లను జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.అరుణ్‌బాబుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వంకా రవీంద్రనాథ్‌, కవురు శ్రీనివాస్‌ నామినేషన్‌ సమయంలో వారి వెంట రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంఎల్‌ఎలు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి తదితరులు ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల రెండు ఎంఎల్‌సి స్థానాలకు ఇప్పటి వరకు మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో డిఆర్‌ఒ, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎవిఎన్‌ఎస్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు: ఎంఎల్‌సి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పాలకొల్లు నుంచి తన అనుయాయులతో ఊరేగింపుగా ఏలూరు తరలి వెళ్లారు. ఆయన వెంట ఎస్‌సి కమిషన్‌ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్‌, డిసిఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు తదితరులున్నారు.
తణుకు: ఎంఎల్‌సి అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి తణుకు పట్టణానికి చెందిన వంక రవీంద్రనాథ్‌ బుధవారం ఏలూరు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తొలుత పట్టణంలో వినాయకుని ఆలయంలో రవీంద్రనాధ్‌, రాజకుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు.