Aug 08,2021 06:58

చరిత్రాంతాన్ని గురించిన సిద్ధాంతాలు చెలరేగుతున్నప్పుడు సోషలిజం అజేయమని చెప్పడం, ప్రపంచీకరణ వేదమంత్రంలా మార్మోగుతున్నప్పుడు ప్రత్యామ్నాయాలకై వాదించడం, మతోన్మాదం మంటలు పెడుతున్నప్పుడు లౌకిక పతాకం ఎగరేయడం చిన్న విషయాలు కాదు. ఆశయ బలమే ప్రజాశక్తికి ఆ శక్తినిచ్చింది. రాజకీయ నైశిత్యం, ఉద్యమాల ఆలంబన, శ్రేయోభిలాషుల అండదండలు ఉంటే సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడం సాధ్యమని ప్రజాశక్తి గమనం నిరూపిస్తుంది.
     ప్రజాశక్తి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుని 41వ వార్షికోత్సవం జరుపుకొంటున్న సమయం. అక్షరాక్షర దీక్షగా / ఆశయాలే రక్షగా / నడచి వచ్చిన దారులు / గడిచిపోయిన రోజులు...ఈ సందర్భంలో కళ్ల ముందు కదలాడతాయి. దానితో సన్నిహిత సంబంధం, భాగస్వామ్యం ఉన్న వారికి పత్రిక చరిత్ర, పెరుగుదల కళ్ల ముందు కదలాడతాయి.
     తెలుగులో పత్రికలు ప్రధానంగా సంఘ సంస్కరణలు, స్వాతంత్య్ర పోరాటం, వామపక్ష ఉద్యమాలు అన్న మూడు నేపథ్యాలలో తొలి అడుగులు వేశాయి. 1942లో ప్రజాశక్తి వార పత్రికగా ప్రారంభమైంది. ఆ విధంగా చూస్తే ఇది ఎనభయ్యవ వార్షికోత్సవం కూడా. ఫాసిస్టు యుద్ధాన్ని ఖండించడం లోను, ప్రగతిశీల భావాలను వ్యాపింపచేయడంలోనూ నాటి ప్రజాశక్తి కీలక పాత్ర వహించింది. 1945లో దినపత్రికగా మారింది. సుందరయ్య, కంభంపాటి, మద్దుకూరి వంటి వారి కృషి ఇందులో ఉంది. శ్రీశ్రీ, కొకు, ఉప్పల వంటి సుప్రసిద్ధుల రచనలు దానిలో వచ్చేవి. గ్రాంథికం, వ్యవహారం, వాదోపవాదాల మధ్య పత్రికా భాష ఇంకా పూర్తిగా స్థిరపడని ఆ కాలంలో జన సామాన్యానికి అర్థమయ్యే విధంగా రాయడంలో ప్రజాశక్తి భాషకు ఒరవడి, భావాలకు ఒరిపిడి అయింది. ఇది నచ్చని ఛాందసులు 'పెద్ద బాలశిక్ష ఫెయిల్‌-ప్రజాశక్తి పాస్‌' అని అపహాస్యం చేశారు కూడా! 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రజాశక్తి వాణిగా పనిచేసింది. ప్రభుత్వం 1948లో ప్రజాశక్తి నగర్‌పై దాడి చేసి, విధ్వంసానికి పాల్పడింది. మళ్లీ ఆరేళ్లకు 1951లో వారపత్రికగా పున:ప్రారంభమైంది. కొన్నాళ్ళ తర్వాత దినపత్రికగా మారినా నాడు విశాలాంధ్ర కోసం జరుగుతున్న పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని పత్రికకు కూడా అదే పేరు పెట్టారు. మద్దుకూరి చంద్రం, మోటూరు హనుమంతరావు తదితరులు దాని సంపాదకులుగా ప్రసిద్ధులు. ప్రజాశక్తి 1968లో వారపత్రికగా 1981 ఆగస్టు ఒకటవ తేదీన దినపత్రికగా అవతరించింది. మోటూరు హనుమంతరావు అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య సమక్షంలో నాటి సిపిఎం కార్యదర్శి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ దాన్ని ఆవిష్కరించడం ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నట్టుంది. చాలా మంది ఈ పత్రిక నడవటం కష్టమని మాతోనే అనేవారు. కాని సందేహాలు పటాపంచలు చేస్తూ అక్షరాయుధంగా పదునెక్కుతూ ప్రజాశక్తి ప్రస్థానం నడిచింది. అంకిత భావం గల నాయకత్వం, పాత్రికేయులు, కార్మికులు సిబ్బంది సేవలు, ఉద్యమాభిమానులు పత్రిక శ్రేయోబిలాషుల అండదండలు దాన్ని నిలబెట్టాయి.
    ఈ నలభయ్యేళ్ల కాలంలో అంతర్జాతీయం గానూ, దేశం లోనూ లౌకిక ప్రగతిశీల శక్తులు అనేక పోరాటాలు ఉద్యమాలు చేశాయి. అనేక ఎదురుదెబ్బలూ తగిలాయి. 1981 అఖిలపక్ష ఉద్యమం, 1982లో సిపిఎం అఖిల భారత మహాసభల మహా సమీకరణ తర్వాత 83 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చారు. 1984లో సానుభూతి పవనాలతో రాజీవ్‌గాంధీ గద్దెనెక్కారు. 1990లలో సోషలిస్టు శిబిరంలో కల్లోలం చెలరేగి చివరకు 1991లో సోవియట్‌ యూనియన్‌ కూడా విచ్ఛిన్నమైంది. దేశంలో సరికొత్త ఆర్థిక విధానాలు, వాటి వెంటనంటి రాజకీయాలలో మితవాద, మతవాద దాడి మొదలైనాయి. చివరకు 1998లో బిజెపి అధికారం చేపట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం దానితో జత కట్టి మరోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడంలో ప్రథమ పీఠిన నిలిచింది. పత్రికల మైండ్‌సెట్‌ మారాలని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండేవారు. ఆ సమయంలో సాగిన విద్యుచ్ఛక్తి ఉద్యమానికి ప్రజాశక్తి ప్రాణవాయువులా సేవచేసింది. ఆ ప్రభుత్వం మారి 2004లో వై.ఎస్‌ ప్రభుత్వం వచ్చాక భూపోరాటం వంటివి జరిగాయి. తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమం మొదలైంది. 2014 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలైనాయి కూడా. కేంద్రంలోనేమో కరుడుగట్టిన మతతత్వం కార్పొరేట్‌ తత్వం సామ్రాజ్యవాద అనుకూలతల కలయికగా మోడీ ప్రభుత్వం కొలువుతీరింది. ఈ దశలన్నిటా ప్రజాశక్తి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేదికగా నిలిచింది. నిలుస్తోంది. ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతిరూపమైంది. విభజిత ఆంధ్ర ప్రదేశ్‌కే అంకితమైన పత్రిక ఇప్పుడు ప్రజాశక్తి ఒక్కటే కావడం విశేషం. అప్పుడూ ఇప్పుడూ పత్రికా పరంగానూ సిద్ధాంత పరంగానూ ప్రజాశక్తికే సొంతమైన ప్రత్యేకతలు చాలా వున్నాయి.
   చరిత్రాంతాన్ని గురించిన సిద్ధాంతాలు చెలరేగుతున్నప్పుడు సోషలిజం అజేయమని చెప్పడం, ప్రపంచీకరణ వేదమంత్రంలా మార్మోగుతున్నప్పుడు ప్రత్యామ్నాయాలకై వాదించడం, మతోన్మాదం మంటలు పెడుతున్నప్పుడు లౌకిక పతాకం ఎగరేయడం చిన్న విషయాలు కాదు. ఆశయ బలమే ప్రజాశక్తికి ఆ శక్తి నిచ్చింది. మోయలేని భారంగా మారిన పత్రికా నిర్వహణలో కొన్ని ప్రముఖ పత్రికలే ఆగిపోయాయి. ఆగినవాటిలో ఒక పత్రిక తప్ప వాటిలో మళ్లీ గట్టిగా బతికి బట్టకట్టినవి లేవు. నిన్నటి పెద్ద పత్రికలు కొన్ని ఇప్పుడు నామమాత్రంగా నడుస్తున్నాయి. హైదరాబాదులో రెండవ ఎడిషన్‌ ఆలోచన అవాస్తవికమని చాలా మంది జోస్యాలు, జాగ్రత్తలు చెప్పారు. అలాంటి ప్రజాశక్తి నేటి ఎనిమిది ఎడిషన్లతో విస్తృతమైన యంత్రాంగంతో, రంగుల యంత్రాలతో ముందుకు పోవడం ఫలప్రదమైన ప్రయోగం. సమస్యలు లేవని కావు, వనరుల కొరత లేదనీ కాదు. ప్రస్తుత కరోనా తాకిడితో సహా చాలా సంక్లిష్ట సమస్యలే వుంటాయి. రాజకీయ నైశిత్యం, ఉద్యమాల ఆలంబన, శ్రేయోభిలాషుల అండదండలు ఉంటే సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడం సాధ్యమని ప్రజాశక్తి గమనం నిరూపిస్తుంది.
     సామాజిక మార్పులను, సాంకేతిక ప్రగతిని పరిగణనలోకి తీసుకుని ముందుకు పోవడంలోనే ఈ పురోగమన రహస్యం వుంది. సంస్కరణలు వాటికవే చెడ్డవి కావు. చెడ్డ సంస్కరణలే ప్రమాదకరమైనవి. ప్రజాశక్తి ఆ సూత్రాన్ని అన్వయించుకోవడం వల్లనే ప్రగతిశీల వాదులకు వేదిక కాగలిగింది. తమ మౌలిక అభిప్రాయాలకు కట్టుబడి ఉంటూనే లోగోతో సహా అనేక మార్పులు చేసుకుంది. శ్రమజీవుల ప్రయోజనాలను ప్రతిధ్వనిస్తూనే అందరి అభిప్రాయాలు, వార్తలు సముచితంగా ప్రచురిస్తుంది. సాంకేతిక వికాసంతో ఈ నలభయ్యేళ్లలో మీడియా ముఖచిత్రం ఎంతగానో మారింది.
     ఆధిపత్య శక్తులకు అంగీకార సృష్టి నేటి ప్రపంచాధిపత్య వ్యూహంలో ప్రధానాంశం. ఇందులో పెద్ద పాత్ర మీడియాది. అందుకే ప్రజానుకూల శక్తులు ప్రత్యామ్నాయ మీడియా కోసం పెద్ద కృషి చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల కూడా ప్రత్యామ్నాయ భావజాల కృషి ఉధృతమవుతున్నది. తెలుగు మీడియా ముఖ్యులలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రగతిశీల భావాల ప్రేరణ లేనివారు చాలా తక్కువ. కాని ఇప్పుడు భారతీయ మీడియాలో ఇంగ్లీషు లోనూ, తెలుగు లోనూ, సోషల్‌ మీడియా లోనూ కార్పొరేట్‌ శాసనం ప్రబలిపోయింది. ఆంక్షల అంకుశాలు, నిరంకుశ పాలకుల శాసనాలు మీడియాను వేటాడుతుంటే ఆ విలువలు వెలవెలబోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగునాట ప్రధాన పత్రికలు, ఛానళ్లు రెండు ప్రాంతీయ పాలక పార్టీల మధ్య విభజింపబడి వివాదాలలో మునిగి తేలుతున్నాయి. దేశం నెత్తిన కూచున్న మోడీ అప్రజాస్వామిక పోకడలను బహిర్గతం చేయడం వీటి ఎజెండా లోనే వుండదు. అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యాన్ని ప్రతిఘటించడమూ వుండదు. పెగాసస్‌, కాశ్మీర్‌, రైతాంగ ఆందోళన ఏదైనాసరే ఢిల్లీ పెద్దల దృక్పథానికి విరుద్ధమైన విశ్లేషణలూ, పరిశీలనలూ వీటిలో అరుదుగా గాని కనిపించవు. ఈ సోషల్‌ మీడియా యుగంలో ఇందుకు సంబంధించిన విస్తారమైన సమాచారం ప్రజాస్వామిక మేధావులు, పాత్రికేయులు, రచయితలు తవ్వితీస్తున్నా వీరికి అక్కర్లేదు. ఈ రాష్ట్రంలో తాము బలపర్చే పక్షాన్ని తలకెత్తుకోడం, అవతలి పక్షంపై దాడి చేయడం అవసరమైతే అందుకు అవాస్తవాలూ అతిశయోక్తులైనా ప్రధానంగా ప్రచారంలో పెట్టడం నిత్యకృత్యమైంది. ఒకరు అధికారంలో వుంటే మరో వైపు మీడియాపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ఇతర వాణిజ్య పోకడలు, సంచలనాలు, సెలబ్రిటీ ముచ్చట్లు సరేసరి. ఒకప్పుడు వాటిని మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రికలనీ, ప్రజాశక్తి వంటి వాటిని వామపక్ష పత్రికలనీ అనేవారు. అయితే ఇప్పుడు ప్రజాశక్తి వంటివి మెయిన్‌ స్ట్రీమ్‌ కాగా చాలా పత్రికలు ఆయా పాలక పార్టీల స్ట్రీమ్‌లుగా, స్టీమ్‌లుగా మారాయి. ఈ పరిస్థితుల్లో విశ్వసనీయత, స్వతంత్రత, నిస్పాక్షికతలకు కట్టుబడి ప్రజల పక్షంగా యథార్థాన్ని ఆవిష్కరించే బాధ్యత పూర్తిగా మోస్తున్నది ప్రజాశక్తి వంటి పత్రికలే. అందుకే ప్రజలు వీటిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. అయితే రానురాను ఈ సవాళ్లు తీవ్రమవుతాయే గాని తగ్గవు. ఎందుకంటే ప్రత్యామ్నాయ మీడియా అనేది పాలకులకు సింహస్వప్నంగా వుంది. మోడీ అధికారం లోకి రావడానికి ఉపయోగించుకున్న సోషల్‌ మీడియానే ప్రజాస్వామిక వాదులు ఉపయోగించుకుంటే అపరాధమైపోతున్నది. సుప్రీం కోర్టు ముందు మీడియాకు సంబంధించిన కేసులు ఎన్ని వున్నాయో చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో కాలపరీక్షకు నిలిచిన ప్రజాశక్తిని పటిష్టం చేసుకోవడం, మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంతైనా అవసరం. ఆలోచనా పరులు ఎవరైనా పాలకపక్ష మీడియా పోకడలకే కొట్టుకుపోవడంగాక ప్రత్యామ్నాయ, ప్రజాస్వామిక సమాచార స్రవంతిగా ఆశయాలకు ఆలవాలంగా ముందుకు సాగుతున్న ప్రజాశక్తిని తమదిగా భావించాలి. ఎంతో జటిలమైన గత సవాళ్లను అధిగమిస్తూ నాలుగు దశాబ్దాలు నడిచిన ప్రజాశక్తి చరిత్రకు తోడు ఇప్పుడు ఎందరో కొత్త శక్తుల చేరిక, చైతన్యవంతమైన ఉద్యమాల కదలిక అందుకు విశ్వాసమిస్తుంది.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి