ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన టిడ్కో గృహాల అప్పగింత ప్రహసనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 32 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టగా గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు వివిధ దశలో ఉండగా ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ హయాంలో శ్లాబులు వేసి వదిలేయగా అంతర్గత పనులు, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాలుగు ఏళ్లు సరిపోలేదు. ఇళ్ల అప్పగింతలో తీవ్ర జాప్యం కాగా మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా కల్పించలేకపోతున్నారు. దీంతో పేదవర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
గుంటూరు జిల్లాలో అడవితక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో గుంటూరు నగర వాసులకు 7472 గృహాలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిల్లో ఒక్కటి కూడా ఇంతవరకు లబ్ధిదారులకు అప్పగించలేదు. తెనాలిలో చినరావూరు, పూలేకాలనీలో1856 ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటివరకు 848 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. పూలేకాలనీలో 1008 ఇళ్లకు సంబంధించి పనులు ఇంకాపూర్తి కాలేదు. మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభం కాలేదు. మంగళగిరిలో 1728 ఇళ్లు అప్పగించినా తాగునీటి సమస్య వెంటాడుతోంది. రాజధానిలో నిడమర్రు, నవులూరు, పెనుమాక, అనంతవరం, మందడడం, తుళ్లూరు, దొండపాడు, ఐనవోలులో మొత్తం 6384 ఇళ్లు నిర్మాణం చేపట్టగా 5024 లబ్ధిదారులకు అప్పగించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా 1360 పెండింగ్‌లో ఉన్నాయి. పొన్నూరులో నిడుబ్రోలులో 2368 ఇళ్లకు గాను 1456 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. గుంటూరులో ఇళ్ల అప్పగింతకు కార్పొరేషన్ అధికారులు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్షంగా వ్యవహరించడమేనన్న విమర్శలు లేకపోలేదు. తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటులోనూ జాప్యమైంది. కాలనీలోని ఇళ్లలో అంతర్గత పనులు నాణ్యత లేదనే విమర్శలు వచ్చాయి. అడవి తక్కెళ్లపాడులో 4192 ఇళ్లను త్వరలో లభ్ధిదారులకు అప్పగిస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు. మరోవైపు టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించే ప్రక్రియ పూర్తి కాలేదు.
సమన్వయంతో పనిచేయాలి : టిడ్కో చైర్మన్
మెప్మా, లీడ్ బ్యాంకు అధికారులు, టిడ్కో అధికారులు సమన్వయంతో రుణాలు మంజూరు చేయాలని టిడ్కో చైర్మన్ జె. ప్రసన్నకుమార్ ఆదేశించారు. బుధవారం అడవి తక్కెళ్లపాడు గృహ సముదాయాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరలో గృహాలను అందజేయాలన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో జాప్యం తగదన్నారు. రాష్ట్రంలో వచ్చే రెండునెలలో 31,090 గృహాలను అందించేందుకు కార్యచరణ రూపొందించినట్టు మీడియాకు తెలిపారు. అడవితక్కెళ్లపాడులో ఈనెలాఖరుకు గృహాలను లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. వెంగళాయపాలెంలో పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులతో చర్చించారు. గృహాలను ఆగస్టులో లబ్ధిదారులకు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.










