ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో నాలుగేళ్ల క్రితం నిలిచిన భూగర్భ డ్రెయినేజి పనులు ఎప్పటికి పున: ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పనులు పూర్తి చేస్తామని సిఎం హామీ ఇచ్చి ఏడాదైనా పనుల్లో కదలిక లేదు. భూగర్భ డ్రెయినేజి పనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం జగన్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు.
కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.903.82 కోట్ల అంచనాలతో 2017 జనవరి 30న భూగర్భ డ్రెయినేజి పనులు ప్రారంభించారు. 2019 మే నెల వరకూ దాదాపు 55 శాతం పనులు జరిగాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరులో తీవ్ర జాప్యం వల్ల నత్తనడక పనులు జరిగాయనే విమర్శ ఉంది. 2019 మేలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను సమీక్షించాలని నిర్ణయించారు. దీంతో పనులు నిలిపివేశారు. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను కాంట్రాక్టరుకు చెల్లించింది. తిరిగి పనులు చేపడతామని చెప్పిన కాంట్రాక్టు సంస్థ 2020 నవంబరులో తిరిగి పనులు ప్రారంభించేందుకు అంగీకరించారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గం మంగళదాస్ నగర్, పరమాయకుంట, ఆర్‌టిసి కాలనీలో పనులు ప్రారంభించారు. వారంపాటు పనులు చేసి మళ్లీ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. దాదాపు రెండున్నరేళ్లుగా పనులు ఆగిపోయినా మళ్లీ ఈ సంస్థను సంప్రదించిన వారేలేరు.
10 విలీన గ్రామాల ప్రజలను కలిపి మొత్తం 10 లక్షల జనాభాకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. లక్షా 45 వేల ఇళ్లకు డ్రెయినేజి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 1083.72 కిలో మీటర్ల పైపు లైన్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకూ 505.05 కిలో మీటర్ల మేరకు పైపు లైను నిర్మించారు. 43,574 మ్యాన్ హోల్స్ నిర్మించాల్సి ఉండగా 20,376 నిర్మించారు. 27,044 ఇన్‌స్పెక్షన్ చాంబర్స్ నిర్మించాల్సి ఉండగా 12 వేల వరకూ నిర్మించారు. మొత్తంగా రూ.540 కోట్ల మేరకు పనులు జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భూగర్భ డ్రెయినేజి పనులు పూర్తయినా ఇంత వరకూ ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ వత్తిడి వల్ల పనులు వేగంగా జరగలేదనే విమర్శలు రాగా మూడేళ్లలో జరగాల్సిన పనులు ఎనిమిదేళ్లయినా పూర్తి కాలేదు.
ఈ పనులు కూడా కొన్ని ప్రాంతాల్లో అస్తవ్యస్థంగా జరిగాయి. పైపులైను నిర్మాణం కోసం ఇష్టానుసారంగా తవ్వేశారు. యూజిడి పనులపై కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌లో పలువురు సభ్యులు డిమాండ్ చేసినా గత రెండేళ్లలో మేయర్ ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. 2017-19మధ్య జరిగిన యుజిడి పనులతో నగరంలో రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గోతులు, గుంటలతో దెబ్బతిన్న రహదారుల పనురుద్ధరణలో తీవ్రజాప్యం జరిగి ఐదేళ్లుగా నగర వాసులు నరకయాతన పడుతున్నారు. గత రెండేళ్లలో నగరపాలక సంస్థ అధికారులు కొన్ని రహదారులు నిర్మించినా ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
యుజిడి పనుల కోసం తవ్విని గుంతలు (ఫైల్)










