ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్న వైసిపి ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ యూనియన్ నాయకులు ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయలేదన్నారు. కనీసం కార్మికులకు కేటాయించాల్సిన సంక్షేమ బోర్డు నిధులను కూడా వారికి ఖర్చు చేయకపోగా, ఇతర అవసరాలకు దారి మళ్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న క్లైములు వెంటనే విడుదల చేయాలని, వైయస్సార్ బీమా పథకం కుటుంబ సభ్యులందరికీ వర్తింప చేయాలని కోరుతూ నగరంలో భవన నిర్మాణ కార్మికుల దగ్గర సంతకాలు సేకరించిన పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్తానని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాశింవలి, అధ్యక్షులు దొడ్డా కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు ఆది నికల్సన్, సిఐటియు తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, బి.సత్యనారాయణ, ఎస్.పద్మనాభుడు, అక్కారావు, నాగేశ్వరావు, సీతారామయ్య, జె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.










