Apr 17,2022 15:07
  • నాలుగేళ్ల వయసు అంటే ఆటలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. గట్టిగా మాట్లాడితే సరిగ్గా మాట్లాడటం కూడా నేర్చుకోని వయసు. అలాంటి బాల్య దశలోనే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో బ్లాక్‌బెల్ట్‌ పట్టుకున్న క్రీడాకారిణిగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చేరింది. ఆమే జైపూర్‌కి చెందిన నాలుగేళ్ల మనుశ్రీ సక్సేనా. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సామెత చాలామంది వినే ఉంటారు. జైపూర్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారిని చూస్తే కచ్చితంగా ఇలాంటి వాళ్లను చూసే ఈ సామెత చెప్పి ఉంటారని ఒప్పుకుంటారు. జైపూర్‌కి చెందిన నాలుగేళ్ల మనుశ్రీ సక్సేనా స్థానిక పిహెచ్‌ఇడి స్పోర్ట్స్‌ క్లబ్‌ క్రీడాకారిణి. వయసు నాలుగేళ్లే కాని ఈ చిన్నారిలోని టాలెంట్‌, ఆమె సాధించిన విజయాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రపంచంలోనే ఏ చిన్నారీ ఆమెకు పోటీ కాదని చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలోనే కరాటే బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా మనుశ్రీ పేరు గడించింది. అంతేకాదు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. 2020లో జరిగిన టోక్యో గేమ్స్‌లో కరాటే పోటీలతో అడుగుపెట్టిన చిన్నారి ప్రస్తుతం పతకాల సాధించడంలో దూసుకుపోతోంది.

  • రెండేళ్ల సాధనలో...

రెండేళ్ల సాధనలో అనేక జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది. మనుశ్రీకి మార్షల్స్‌ ఆర్ట్స్‌లోనే కాదు డ్యాన్స్‌లోనూ ఎంతో నైపుణ్యం ఉంది. ఓవైపు కరాటే శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూనే చదువులోనూ రాణిస్తోంది. ఇంత చిన్న వయసులోనే బ్లాక్‌బెల్ట్‌ సాధించిన వరల్డ్‌ వండర్‌ కిడ్‌ మనుశ్రీ సక్సేనా ఏకంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి కూడా కరాటే నేర్పిస్తానంటోంది. ప్రధాని దేశ శత్రువులతో పోరాడే విధంగా తర్ఫీదు ఇస్తానంటోందీ చిన్నారి.

  • నాలుగేళ్లకే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌..

కేవలం రెండేళ్ల వయసులోనే మనుశ్రీకి కరాటేలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. ఏదైనా విషయం చెప్పినప్పుడు మనుశ్రీ ఆ విషయాన్ని వెంటనే నేర్చుకునేది. ఆ ఆసక్తితోనే ఆసియా కరాటే ఫెడరేషన్‌ కరాటే కోచ్‌ మహేష్‌ కయత్‌ దగ్గర మనుశ్రీ సోదరి తనుశ్రీ సక్సేనా కరాటే క్లాసులకు వెళ్లేది. ఆమెతో వెళ్లిన మనుశ్రీ అక్కడ కిక్స్‌, పంచ్‌లు ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అక్కడ నేర్చుకున్న విషయాలను ఇంటికొచ్చాక ఆమె తండ్రిపై ప్రాక్టీసు చేసేది. కరాటే నెర్చుకోవాలన్న మనుశ్రీ ఆసక్తిని గమనించిన కోచ్‌, కుటుంబసభ్యులు ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో మనుశ్రీని అకాడమీలో చేర్పించారు. మనుశ్రీ మంచి కరాటే మాస్టర్‌ అవుతుందని గ్రహించి అకాడమీలోనూ ఆమెకు మెరుగైన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కరాటేలో శిక్షణ పొందుతూనే అతి తక్కువ కాలంలో ఏ చిన్నారీ సాధించని విజయాలను మనుశ్రీ నాలుగేళ్లలో సాధించడం గర్వంగా ఉందని కోచ్‌, తల్లిదండ్రులు చెబుతున్నారు.

  • చిన్నారి కాదు చిచ్చరపిడుగు..

మనుశ్రీ సక్సేనా కరాటేలో ఇన్ని పతకాలు సాధించడం గొప్ప విషయంగా భావించిన కోచ్‌ ఆమె పేరును గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మనుశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపారు. త్వరలోనే ఆ అరుదైన రికార్డును కూడా చిన్నారి మనుశ్రీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనుశ్రీలాంటి చిన్నపిల్లల్లో కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని ప్రోత్సహిస్తే.. దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని కోచ్‌ అభిలాషించారు.
మనుశ్రీని ఇంట్లో తల్లిదండ్రులతో పాటు తాత, అమ్మమ్మలు ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని, ఆసక్తిని ప్రోత్సహించడంతో చిన్నారి ఇప్పుడు చిచ్చర పిడుగులా కరాటే డ్రెస్‌ వేసుకొని బ్లాక్‌ బెల్ట్‌ పెట్టుకొని తనకంటే పెద్దవాళ్లపై పంచ్‌ పవర్‌ ఏంటో నిరూపించుకుంటోంది. ఆమె సాధించిన విజయాలు ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తున్నాయని, కరాటే నేర్చుకుని తమను తాము రక్షించుకునే మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని తల్లి పూజ సక్సేనా, స్పోర్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనుశ్రీ తన వయస్సు పిల్లలతో పోలిస్తే అనూహ్యంగా తనకు మంచి అభ్యసనా సామర్థ్యాలు ఉన్నాయని, కేవలం రెండు సంవత్సరాల్లోనే మను ఈ విజయాలు సాధించిందని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.