Oct 11,2023 22:18

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు ఎస్‌ఎఫ్‌ఐ అనంతపురం 26వ నగర మహాసభలను ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓతూరు పరమేష్‌, సిద్దు, తరిమెల గిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టి డిగ్రీ విద్యను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఇంటర్షిప్‌ పేరుతో విద్యార్థులకు చదివిన చదువుకు సంబంధం లేకుండా సర్వేల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మేజర్‌ మైనర్‌ సబ్జెక్టు విధానంతో విద్యార్థులకు ఏమి చదవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు చదివితే డిప్లొమో, మూడు సంవత్సరాల చదివితే డిగ్రీ, నాలుగు సంవత్సరాలు చదివితే హానర్స్‌ డిగ్రీ పేరుతో డిగ్రీ విద్య స్థాయిని దిగజార్చారని తెలిపారు. హానర్స్‌ డిగ్రీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంగా పోరాడుతామని అన్నారు. విద్యార్థుల సమస్యలపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యా రంగ సమస్యలపై ఉద్యమించడానికి అనంతపురం నగర కమిటీని ఈ మహాసభ ద్వారా 19 మందితో ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన నగర కార్యదర్శిగా శివ, అధ్యక్షులుగా భీమేష్‌, నగర ఉపాధ్యక్షులుగా బసవరాజు, గౌసియా, రజిత, నగర సహాయ కార్యదర్శిలు షాను, శివమ్మ, రంగస్వామి, ప్రవీణ్‌, మాదేష్‌, నగర కమిటీ సభ్యులుగా నరసింహ, నందన్‌, హరీష్‌, మానస, ఫీబ, సాత్విక, విజరు, కిరణ్‌, అఖిల్‌, నవీన్‌, రేణుకలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గౌతమి, సంధ్యారాణి, ఛార్మి, అరుణకుమారి, లహరిక, అనిల్‌, ప్రసాద్‌, కళ్యాణ్‌, ప్రణవ్‌ తదితరులు పాల్గొన్నారు.