Jul 16,2023 21:50

ట్యాంకరు నుంచి తాగునీరు పడుతున్న పట్టణ ప్రజలు

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలో కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అధ్వానంగా సాగుతోంది. పట్టణానికి కూతవేటు దూరంలో నాగావళి నది ఉన్నప్పటికీ దశాబ్ద కాలం నుండి ఉన్న తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపాలిటి పరిధిలోని 30 వార్డులలో రోజు విడిచి రోజు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో నాలుగైదు రోజులకోసారి మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ సమస్య ఇలాగే కొనసాగుతోంది. మున్సిపల్‌ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రశ్నిస్తే ఇన్‌ ఫిల్టరేషన్‌ బావుల వద్దకు నీరు వెళ్లకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని చెబుతున్నారే తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు. అధికారులు, పురపాలకుల తీరుపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా మారిన తరువాత ఉన్నతాధికారులు దృష్టిసారించి, సమస్య పరిష్కరిస్తారని ఆశించినా ఆ రకమైన చర్యలేవీ తీసుకున్నట్లు కనిపించడం లేదని వాపోతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.