ఎన్ని అడుగులేసినా
కాలసముద్రం
నా జాడలను చెరిపేస్తుంది !
ఎన్ని రెక్కలు తొడిగినా
అలసిన శ్వాస
నన్ను నేలకు చేరుస్తుంది!
ఎన్ని లోతులు చూసినా
వయసు ప్రవాహం
నన్ను అనుభవ తీరానికి చేరుస్తుంది!
ఎన్ని సమూహాలను కలిసినా
ఒంటరితనం
నన్ను ఒడ్డుకు చేరుస్తుంది !
అందుకే...
నాలోకి నేను
పయనిస్తూనే ఉంటాను,
నన్ను నేను చేరే వరకు !
- పుట్టి గిరిధర్
94914 93170