ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ అమ్మవారి భవానీ దీక్షా విరమణ మహాోత్సవాలు నాల్గవ రోజు ఆదివారం భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఈనెల 15 తేదీ గురువారం నుండి 19వ తేదీ వరకూ (ఐదు రోజుల పాటు) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న భవానీ దీక్షల విరమణ నాల్గవరోజు ఆదివారం కావటంతో సుమారు లక్ష మందికి పైగా భవానీలు విజయవాడ నగరానికి చేరుకుని గిరిప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను తెల్లవారుజాము 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుని హాోమగుండంలో మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు భక్తుల కోసం అన్న ప్రసాద ప్యాకెట్లను పంపిణీ చేశారు. కనకదుర్గా నగర్‌లో పది లడ్డూ కౌంటర్ల ద్వారా ప్రసాదాల అమ్మకం నిర్వహించటంతో భవానీలు లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు.
భవానీలతో కలిసి గిరి ప్రదక్షిణ చేసిన ఆలయ ఇఓ భ్రమరాంబ : భవానీ దీక్షా విరమణ మహాోత్సవాలలో భాగంగా ఆదివారం గిరిప్రదక్షిణ కార్యక్రమంలో దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్ కోటేశ్వరరావు, ఎల్. రమాదేవి, వైదిక కమిటీ సభ్యులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో భవానీల ఇబ్బందులను అడిగి తెలుసుకుని తగు ఏర్పాట్లు చేశారు.
భవానీ దీక్షా విరమణల సందర్భంగా సిపి ఆకస్మిక తనిఖీలు :
శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దీక్షా మాల విరమణలు పురస్కరించుకొని 15వ తేదీ నుండి నేటి వరకూ జరుగుతున భవానీ దీక్షా విరమణల సందర్భంగా రాత్రి సమయంలో నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పర్యటించి పెరిగిన భవాని భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకుని గిరిప్రదక్షణపై సమగ్ర పరిశీలన చేశారు. సీతమ్మ వారి పాదాలు, పద్మావతి ఘాట్, భవానీ ఘాట్ మరియు పున్నమీ ఘాట్ లతోపాటు హాోమగుండాలు, మాల, విరుముడి విరమణ, ప్రసాదం కౌంటర్ ప్రదేశాలను, క్యూ లైన్‌లను, మరియు ట్రాఫిక్ డైవర్షన్ ప్రదేశాలను ఆకస్మికంగా పర్యటించి, ఆయా ప్రదేశాలలో విధులు నిర్వహించు అధికారులను మరియు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
నేడు మహా పూర్ణహుతితో ముగియనున్న భవానీ దీక్షలు :
గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న దుర్గాభవానీల మాలా విరమణ కార్యక్రమం సోమవారం మహా పూర్ణాహుతితో ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.










