
రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ను ప్రశ్నించిన శృంగవృక్షం సర్పంచి సూరిబాబు
సమన్వయంతో పని చేయాలి
పాలకోడేరు మండల సమావేశంలో ఎంపిపి చంటిరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణనికి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారని, నాకు తెలీకుండా గ్రామంలో ఎక్కడ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారంటూ శృంగవృక్షం గ్రామ సర్పంచి జంగం సూరిబాబు రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణరాజును ప్రశ్నించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, చేపట్టబోయే ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ మండలానికి 440 రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. 13 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభమైందని, నాలుగు గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. శృంగవృక్షం సర్పంచి సూరిబాబు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి డంపింగ్ యార్డ్ నిర్మాణానికి స్థలాన్ని అణ్వేషిస్తున్నామని, అనువైన కొన్ని స్థలాలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గ్రామంలో కొంతమంది ఎవరో కోర్టుకి వెళ్లామని, ఆరు వారాల్లో డంపింగ్‌యార్డు నిర్మించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయని తెలిసిందన్నారు. అసలు తనకు తెలియకుండా డంపింగ్ యార్డు స్థలం ఎక్కడ ఉందో చెప్పాలని రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ను ప్రశ్నించారు. కలెక్టర్, మండల రెవెన్యూ శాఖకు కోర్టు నుంచి నోటీసు అందిందని, అయితే దానిలో డంపింగ్ యార్డ్ నిర్మించాలనే విధంగా ఆదేశాలు లేవని, ఆరు వారాల్లో జవాబు ఇవ్వాలనే విధంగా ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. తాను సామాన్యమైన సర్పంచినని, సొంత డబ్బులతో రావి చెరువు పనులు చేయిస్తే డబ్బులు రాలేదన్నారు. అధికారులు చేయాల్సిన పనులు సర్పంచులగా తాము చేస్తున్నామన్నారు. జనసేన ఎంపిటిసి సభ్యులు సవరం సత్యకృష్ణ మాట్లాడుతూ రేషన్ ద్వారా కందిపప్పు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగనన్న లే అవుట్‌లో పూడిక తీయాలన్నారు. ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ మురళీగంగాధరరావు, ఉప ఎంపిపిలు నరేష్, ఆదాడ లక్ష్మీతులసి, కో ఆప్షన్ సభ్యురాలు డాక్టర్ డిఆర్.స్వర్ణలత, సర్పంచులు బోల్ల శ్రీనివాస్, కడలి నాగేశ్వరి, ఇంజెటి మరియమ్మ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
విస్సాకోడేరు సర్పంచి శ్రీనివాస్‌కు సత్కారం
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సర్పంచిగా అవార్డు పొందిన విస్సాకోడేరు సర్పంచి శ్రీనివావాస్‌ను కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ డిఆర్.స్వర్ణలత ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంపిపి చంటిరాజు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సర్పంచిగా శ్రీనివాస్‌కు అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పాల జ్యోతి, నాగలక్ష్మి, శాంతకుమారి, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి, పోలయ్య, ప్రసాద్, వెంకటరాజు, రాజేష్ పాల్గొన్నారు.