Oct 20,2023 20:51

దాడులకు పాల్పడుతున్న ఇరు వర్గాలు

ప్రజాశక్తి - నందవరం
నాగలదిన్నె గ్రామంలో ఓవైపు వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని, వద్దు అంటూ మరో వర్గం ఆపడంతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. మండలంలోని నాగలదిన్నె గ్రామంలో పెద్దమ్మ అవ్వ గుడి వెనకాల ఉన్న రేకుల షెడ్డు స్థలంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని వాల్మీకులు, ఆ స్థలం పెద్దమ్మ అవ్వ దేవాలయానికి సంబంధించిందని వడ్డెర కులస్తులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గ్రామస్తుల వివరాల మేరకు... పెద్దమ్మ దేవాలయం వెనకాల ఉన్న రేకుల షెడ్డు స్థలంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని గత నాలుగు రోజుల క్రితం వడ్డెర సంఘం పెద్దలకు వాల్మీకి సంఘం పెద్దలు సమాచారం అందించారు. ఎలాంటి సమాధానమూ రాకపోవడంతో వాల్మీకులు అందరూ కలిసి రేకుల షెడ్డును తొలగించేందుకు ప్రయత్నించారు. వడ్డెర సంఘం వాళ్లు అడ్డుకున్నారు. ఇరువర్గాలు కోపోద్రక్తులై ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, కారంతో దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో వడ్డే మహదేవమ్మకు గాయాలు కాగా, ఆమెను ప్రభుత్వాస్పత్రి తరలించారు. సమస్య చేయి దాటుడుతుందని సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చల్లాచెదురు చేశారు. ఇరు వర్గాలకు గొడవలు సృష్టించడంలో ఓ మాజీ సర్పంచి హస్తం ఉందని, ఆయన మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం రావడంతోనే వాల్మీకులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రయత్నం చేశారని ప్రజలు పేర్కొంటున్నారు.

గొడవకు కారమైన రేకుల షెడ్‌ స్థలం
గొడవకు కారమైన రేకుల షెడ్‌ స్థలం